Abhishek Sharma: ఆ హీరో అంటే పడి చస్తానంటున్న టీమిండియా స్టార్ ఓపెనర్.. హైదరాబాద్‌లో ఉంటే ఆయన సినిమాలే చూస్తా!
క్రికెట్ మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఒక్కసారి బ్యాట్ ఝుళిపిస్తే బంతి స్టేడియం అవతల పడాల్సిందే. టీమిండియాలో సెన్సేషనల్ ఓపెనర్‌గా ఎదుగుతూ, విరాట్ కోహ్లీ స్థాయి స్టార్‌డమ్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తున్న ఆ యువ క్రికెటర్ టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పారు.

ఇప్పుడు తనలోని సినిమా పిచ్చిన బయటపెట్టాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే తనకు ఎంత ఇష్టమో చెబుతూ టాలీవుడ్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. హైదరాబాద్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం కారణంగా ఇక్కడి స్టార్ హీరోల స్టైల్‌కు ఆయన ఫిదా అయిపోయాడు. ఒక సూపర్ స్టార్ అంటే తనకు పిచ్చని, ఆయన సినిమాలు చూస్తూనే ఖాళీ సమయాన్ని గడుపుతానని వెల్లడించాడు. అలాగే మరో ఐకాన్ స్టార్ మేనరిజమ్స్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ విధ్వంసకర బ్యాటర్ ఎవరు? ఆయనకు ఇష్టమైన ఆ టాలీవుడ్ హీరోలెవరో తెలుసుకుందాం..
ఆయన సినిమాలంటే మహా ఇష్టం..
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫేవరేట్ తెలుగు హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని తెలియజేశాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు లేదా ఖాళీ సమయం దొరికినప్పుడు మహేష్ బాబు సినిమాలు చూస్తుంటానని చెప్పాడు. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి తన సహచర తెలుగు ఆటగాళ్లను అడిగి మరీ తెలుసుకుంటుంటానని అభిషేక్ శర్మ వెల్లడించాడు.
కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే కూడా తనకు చాలా గౌరవమని అభిషేక్ శర్మ తెలిపాడు. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా చూశాక తనకు పిచ్చెక్కిపోయిందని, అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని ప్రశంసించాడు. ఒక ఆటగాడిగా మైదానంలో ఉండే దూకుడుకు, తెరపై అల్లు అర్జున్ చూపించే అగ్రెసివ్ నటనకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులు సినిమాను, క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమిస్తారని, అందుకే ఇక్కడి హీరోల గురించి తెలుసుకోవడం తనకు సంతోషాన్ని ఇస్తుందని అన్నాడు.

Abhishek And Maheshbabu
ప్రస్తుతం అభిషేక్ శర్మ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిసిన ఆయన, మూడో టీ20లో కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. పది ఓవర్లలోనే మ్యాచ్ ముగించి ప్రత్యర్థి కెప్టెన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. అయితే కొన్ని మ్యాచ్‌లలో గోల్డెన్ డకౌట్ కావడంతో విమర్శలు ఎదురైనా, తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడుతూ టీమిండియాకు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అభిషేక్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్లేనని ప్రత్యర్థి జట్లు భావించేంతలా ఆయన ఇంపాక్ట్ ఉంటోంది.
విరాట్ కోహ్లీ వారసుడిగా..
గతంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగితే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇప్పుడు అదే స్థాయి స్టార్‌డమ్‌ను అభిషేక్ శర్మ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తనదైన సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే సమయంలో తెలుగు భాషను, ఇక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటానని ఆయన చెప్పడం గమనార్హం. మైదానంలో మెరుపులు మెరిపించే క్రికెటర్లు కూడా మన టాలీవుడ్ హీరోల స్టైల్‌కు ఫిదా అవుతున్నారంటే మన సినిమాల రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు క్లాస్, అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ ఇప్పుడు క్రికెట్ తారలను కూడా ఆకట్టుకుంటోంది.
