అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్
నటభూషణ శోభన్ బాబుకు అద్భుత విజయాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. డి. రామానాయుడు నిర్మించిన మాంగల్య బలం చిత్రంలో శోభన్ బాబు, జయసుధ, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎంకి నాయుడు బావ తర్వాత శోభన్ బాబు, దర్శకుడు బోయిన సుబ్బారావు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది.

తెలుగు సినిమా చరిత్రలో నటభూషణగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శోభన్ బాబు. ఇక శోభన్ బాబుకు అద్భుతమైన విజయాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ప్రముఖమైనది. ఈ సంస్థ అధినేత డి. రామానాయుడు శోభన్ బాబుని రాజా అని ఆప్యాయంగా పిలిచేవారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు, అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆశగా ఎదురుచూసేవారు. జీవన తరంగాలు, సోగ్గాడు, దేవత వంటి సూపర్ హిట్ చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ శోభన్ బాబుకు అందించింది. ఎంకి నాయుడు బావ సినిమా వచ్చిన ఆరేళ్ల తర్వాత, శోభన్ బాబు, దర్శకుడు బోయిన సుబ్బారావు కాంబినేషన్లో డి. రామానాయుడు నిర్మించిన చిత్రం మాంగల్య బలం. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జయసుధ, రాధిక హీరోయిన్లుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో రాధిక నటించిన తొలి సినిమా ఇదే. ఇద్దరు మహిళల మధ్య నలిగిపోయే వ్యక్తిగా శోభన్ బాబు నటించారు. ఈ రకం పాత్రలు ఆయనకే పరిమితం. ఆయన కూడా వాటికే అంకితమయ్యేవారు.
ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది
శోభన్ బాబు చాలా చిత్రాల్లో ఇద్దరు భార్యల భర్తగా నటించినా, ఆయన పాత్రల్ని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మలచడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆగ్రహించకపోగా, ఆయన్ని ఎంతో అభిమానించేవారు. ఆ ఫార్ములాను పాటిస్తూ తీసిన సినిమానే మాంగల్య బలం. శోభన్ బాబు డేట్స్ తన దగ్గర ఉండడంతో, ఆయనకి తగిన కథ తయారు చేయమని రామానాయుడు రచయిత గుహనాథన్కు అప్పగించారట. ఒక హీరో దగ్గర డేట్స్ తీసుకుంటే వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలన్నది రామానాయుడి సిద్ధాంతం. తొలి సినిమా రాముడు భీముడు నుంచి ఆయన అదే పద్ధతిని పాటిస్తున్నారు. గుహనాథన్ చెప్పిన కథ అందరికీ నచ్చడంతో, 1984 సెప్టెంబర్ 8న మాంగల్య బలం చిత్రం షూటింగ్ ప్రారంభించారు రామానాయుడు. ఈ చిత్ర నిర్మాణం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. పాటలను మాత్రం వైజాగ్, అరకులో చిత్రీకరించారు. మాంగల్య బలంలో అధిక భాగం సన్నివేశాలు హాస్పిటల్లో ఉంటాయి కనుక, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొన్న సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు దర్శకుడు బోయిన సుబ్బారావు.
ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..
సగానికి పైగా చిత్రం పూర్తయ్యాక, ఈ చిత్రం గురించి ఓ చేదు నిజం నిర్మాత రామానాయుడికి తెలిసింది. కథ గురించి తను తొందర పెడుతుంటే, వేరే ఆలోచన ఏమీ తట్టక, దర్శకుడు గుహనాథన్ సావిత్రి, ఏఎన్ఆర్, జగ్గయ్య నటించిన 1965 నాటి మనసే మందిరం సినిమా చూసి, అందులోని మగ పాత్రల్ని ఆడ పాత్రలుగా మార్చి, కొత్తగా కొన్ని పాత్రలు సృష్టించి కథకు ఓ కొత్త రూపం ఇచ్చారట. దాన్ని రామానాయుడికి వినిపించారు. దర్శక నిర్మాతలను మెస్మరైజ్ చేస్తూ కథ చెప్పడం తమిళ కథా రచయితల ప్రత్యేకత. అందులో గుహనాథన్ మరీ నిష్ణాతుడు. అందుకే ఆయనే ఈ కథ చెబుతుంటే, రామానాయుడికి గానీ, బోయిన సుబ్బారావుకి గానీ పాత సినిమాలు ఏవీ గుర్తుకు రాలేదట. సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేయించుకున్నారు గుహనాథన్.
ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను
మనసే మందిరం చిత్రంలో కూడా హాస్పిటల్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ చిత్రంలో అక్కినేని డాక్టర్‌గా నటించారు. మాంగల్య బలంలో ఆ పాత్రను హీరోయిన్గా చేసేశారు. ఆ పాత్రను రాధిక పోషించారు. తీరా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, పాత సినిమా గుర్తుకు రాలేదు దర్శక నిర్మాతలకు. ఆ పరిస్థితుల్లో వెనకడుగు వేయలేక, ఒక విధమైన అసంతృప్తితో చిత్రాన్ని పూర్తి చేశారట రామానాయుడు. 1985 ఏప్రిల్ 5న మాంగల్య బలం చిత్రం విడుదలయింది. అప్పటికే ఇద్దరు హీరోయిన్లతో శోభన్ బాబు నటించిన సినిమాలు చాలా రావడంతో, ఒక విధంగా ప్రేక్షకులు విసుగు చెంది ఉన్న పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రతికూల ఫలితం వచ్చింది. అయితే దీన్ని ముందే ఊహించిన రామానాయుడు పెద్దగా కంగారు పడలేదు. మంచి హీరోకు మంచి హిట్ ఇవ్వలేకపోయినందుకు ఆయన చాలా బాధపడ్డారట. ఈ సినిమాలో పాటలు బాగుంటాయి కానీ, కథ నచ్చక ప్రేక్షకులు తిరస్కరించారు.




