AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవేపై మృత్యుఘోష.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం: ముగ్గురు పసిపిల్లలతో సహా దంపతుల మృతి..!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో శుక్రవారం (మే 08) జాతీయ రహదారి 34పై చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి ముగ్గురు చిన్న పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్త ఒకేసారి ఐదుగురి ప్రాణాలను గాలిలో కలిపేసిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

హైవేపై మృత్యుఘోష.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం: ముగ్గురు పసిపిల్లలతో సహా దంపతుల మృతి..!
Road Accident
Balaraju Goud
|

Updated on: May 08, 2026 | 8:07 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో శుక్రవారం (మే 08) జాతీయ రహదారి 34పై చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి ముగ్గురు చిన్న పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్త ఒకేసారి ఐదుగురి ప్రాణాలను గాలిలో కలిపేసిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దేహత్ కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భన్సోలి కట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఖుర్జా ప్రాంతానికి చెందిన ఉత్తమ్ సింగ్, తన భార్య ఊర్మిళ, ముగ్గురు పిల్లలతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బైక్ పూర్తిగా నుజ్జునుజ్జవడమే కాకుండా, కుటుంబ సభ్యులంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలవడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి దినేష్ కుమార్ సింగ్, ఎస్‌పి సిటీ అభిషేక్ ప్రతాప్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ వాహనంతో సహా పారిపోయాడు. సంఘటనా స్థలంలో హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్‌కు చెందిన విరిగిన లైసెన్స్ ప్లేట్ ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘోర ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హైవే వెంబడి ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. “అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని తెలుస్తోంది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తాం” అని ఎస్‌ఎస్‌పి తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడంతో ఉత్తమ్ సింగ్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రహదారి భద్రతపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, భారీ వాహనాల అతివేగం ఇలాంటి అమాయక ప్రాణాలను బలితీసుకుంటూనే ఉండటం గమనార్హం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us