AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు ‘లజ్జా’ రచయిత్రి తస్లీమా నస్రీన్.. మళ్లీ చెలరేగిన రాజకీయ చిచ్చు!

బంగ్లాదేశ్‌కు చెందిన అత్యంత వివాదాస్పద రచయిత్రి, ఉద్యమకారిణి తస్లీమా నస్రీన్ శుక్రవారం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టారు. వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’ (Dwikhondito) కారణంగా 2007లో తీవ్ర నిరసనలు చెలరేగడంతో ఆమె దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం తొలిసారిగా కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు..

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు 'లజ్జా' రచయిత్రి తస్లీమా నస్రీన్.. మళ్లీ చెలరేగిన రాజకీయ చిచ్చు!
Taslima Nasreen Returns To Kolkata After 19 Years
Srilakshmi C
|

Updated on: Jul 31, 2026 | 5:11 PM

Share

ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి, కవయిత్రి, వైద్యురాలు, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్‌ 19 ఏళ్లు అంటే దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కలకత్తాలో అడుగుపెట్టారు. తస్లీమా నస్రీన్ శుక్రవారం (జులై 31) కలకత్తాకు తిరిగి వచ్చారు. ఆమె రచించిన వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’ (Dwikhondito) కారణంగా 2007లో తీవ్ర నిరసనలు చెలరేగడంతో ఆమె కోల్‌కతా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిణామాల అనంతరం తొలిసారిగా కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా.. ‘ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ఎవరీ తస్లీమా నస్రీన్?

1962 అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పుట్టిపెరిగిన తస్లీమా నస్రీన్‌ తన రచనల్లో మహిళా హక్కులు, లింగ సమానత్వం, మత ఛాందసవాదం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆమె 1993లో రచించిన ‘లజ్జా (Lajja)’ నవల అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. తస్లీమా నస్రీన్ తన లజ్జా బుక్‌లో మతపరమైన ఆచారాలు, ఛాందసవాదం, మహిళలపై వివక్ష వంటి అంశాలను విమర్శించారు. ముఖ్యంగా బాబ్రీ మ‌సీదు కూల్చివేత త‌ర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల‌ను ఊచ‌కోత ప్రధానాంశంగా తన నవల రచించారు. దీంతో కొన్ని మత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ‘లజ్జా’ నవల బంగ్లాదేశ్‌లో వివాదానికి దారితీయడంతో అక్కడ ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఆమెపై మత భావాలను దెబ్బతీశారని ఇస్లామిస్ట్ గ్రూపులు బెడిరింపులకు దిగాయి. దీంతో తస్లీమా నస్రీన్‌ 1994లో బంగ్లాదేశ్‌ను విడిచి పారిపోయారు. విదేశాల్లో తలదాచుకున్న ఆమెకు 2004లో భారత్‌లో నివసించేందుకు అనుమతి రావడంతో కోల్‌కతాకు తిరిగి వచ్చారు.

బంగ్లాదేశ్ విడిచిన తర్వాత తస్లీమా నస్రీన్ కొంతకాలం కోల్‌కతాలో ఉన్నారు. అయితే 2007లో ఆమె రచన ‘ద్విఖండితో’పై నిరసనలు చెలరేగడంతో అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను కోల్‌కతా విడిచి వెళ్లాలని హుకూం జారీ చేసింది. అంతేకాకుండా ఆమె ద్విఖండితో పుస్తకాన్ని బ్యాన్‌ చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలు ముంచెత్తాయి. దీంతోనాటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆమెను మళ్లీ మరో చోటుకు తరలించింది. కొన్నాల్లు జైపూర్, యూరప్‌ లలో తలదాచుకున్నారు. ఆమెపై భారత్‌లో ఎలాంటి నిషేధం లేకపోయినా కోల్‌కతాలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే తస్లీమా నస్రీన్‌కు కోల్‌కతాతో విడదీయరాని బంధం ఉంది. తనకు కలకత్తా రెండో ఇళ్లు అని చెబుతుంటారు. ఎప్పటికైనా కోల్‌కతాలో సెటిల్‌ అవ్వాలనేది ఆమె ఆశ. అయితే ఆమె రచనలు ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నాయి. ఎంతలా అంటే ఆమె రెండు సార్లు దేశం విడిచి పారిపోయేంతగా..! దక్షిణాసియా సాహిత్యం, సామాజిక చర్చల్లో ఆమె ఒక ప్రముఖ, వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి

రేపు కోల్‌కతాలో తస్లీమా నస్రీన్ సభ.. హాజరుకానున్న పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు

ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో ఉంటున్నారు. తన కోల్‌కతా పర్యటనను ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుందని అభివర్ణించారు. తాను కోల్‌కతాను స్వచ్ఛందంగా విడిచిపెట్టలేదని, అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి చేసిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలు గడిచినా తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ కోల్పోలేదని చెప్పారు. తస్లీమా నస్రీన్ శనివారం కోల్‌కతాలోని రవీంద్ర సదన్‌లో జరిగే మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కవితలను చదివి వినిపించడంతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రముఖ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ్ తదితరులు హాజరుకానున్నారు.

అయితే తస్లీమా నస్రీన్ పర్యటనపై బెంగాల్‌లో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్.. తస్లీమా తరచూ ముస్లింలపై విమర్శలు చేస్తారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఆమెను స్వాగతిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాత్రం తస్లీమా రాకను స్వాగతించారు. గత ప్రభుత్వ హయాంలో ఆమెకు తిరిగి రావడానికి అవకాశం ఇవ్వలేదని, రచనలో నిజాలను ప్రస్తావించినందుకు భద్రత కల్పించలేదని విమర్శించారు. వివిధ వర్గాలను రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. కాగా తస్లీమా నస్రీన్ కలకత్తా పర్యటన భావప్రకటన స్వేచ్ఛ, రచయితల హక్కులు, మత ఛాందసవాదంపై చర్చకు మరోసారి దారితీసింది.

Follow Us