మామిడి పండు ఇలా తిన్నారంటేనా..! మీరు భయపడే సమస్యలు అస్సలు దరిచేరవు
వేసవి కాలంలో దొరికే మామిడి పండ్లు ఇష్టపడని వాళ్లు ఉండరు. అయితే ఈ పండ్లను తిన్నప్పుడు ముఖంపై మొటిమలు వస్తాయనే భయం చాలా మందిని వేధిస్తుంది. శరీరంలో వేడి పెరగడం వల్ల లేదా రక్తంలోని చక్కెర స్థాయిల్లో మార్పుల కారణంగా చర్మంపై ఇలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుంటాయి. వాటికి భయపడి మామిడి పండ్లను తినడం మానేస్తే శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తినాలని పెద్దలు చెబుతుంటారు.

పండ్లలో రారాజు మామిడి పండు. వేసవిలో వచ్చే ఈ పండ్లు తినడానికి దాదాపుగా అందరూ ఇష్టపడతారు. అయితే, మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయి. వేడి చేయడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మామిడి పండ్ల వల్ల కలిగే చర్మ సమస్యలను అరికట్టడానికి పోషకాహార నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. కేవలం పండు మాత్రమే తీసుకోకుండా, కొన్ని పదార్థాలను కలిపి తినడం వల్ల మొటిమల సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
ఈ ఒక్క మార్పుతో..
మామిడి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల చర్మంలోని సెబమ్ గ్రంథులు ఎక్కువ నూనె ఉత్పత్తి చేసి రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఈ సమస్యను నివారించడానికి ‘పెరుగు’ అత్యుత్తమ పరిష్కారంగా పనిచేస్తుంది. పెరుగు నేచురల్ కూలెంట్‌గా పనిచేస్తూ మామిడిలోని వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచి చర్మంపై మంటను తగ్గిస్తాయి. పెరుగులోని ప్రోటీన్లు మామిడిలోని చక్కెర రక్తంలో త్వరగా కలవకుండా అడ్డుకుంటాయి.
చర్మ సౌందర్యం పెంచే..
రెండో ముఖ్యమైన కాంబినేషన్ నానబెట్టిన బాదం లేదా చియా విత్తనాలు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నియంత్రిస్తాయి. బాదంలోని విటమిన్ ఇ, జింక్ చర్మ కణాల మరమ్మత్తుకు తోడ్పడతాయి. చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మొటిమల వల్ల వచ్చే ఎరుపును తగ్గిస్తాయి. ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినకూడదు. పాలు, చక్కెర కలిపిన మ్యాంగో షేక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. రోజుకు ఒక మామిడి పండును మాత్రమే ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవాలి.
పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ సరైన కాంబినేషన్లతో మామిడిని ఆస్వాదిస్తే, చర్మం ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా వేసవి కాలంలో వచ్చే మొటిమల భయం కూడా దరిచేరదు.
