‘థియేటర్లు ప్రైవేట్‌ ఆస్తులు.. ఆ విషయంలో పూర్తి హక్కు థియేటర్ల యజమానులకు మాత్రమే ఉంటుంది’

|

Jan 03, 2023 | 5:49 PM

థియేటర్లలోకి బయటి నుంచి తినుబండారాలు, పానియాలు తీసుకెళ్లకుండా నిరోధించే హక్కు సినిమా హాళ్ల యాజమన్యాలకు ఉందని మంగళవారం (జవనరి 3) సుప్రీంకోర్టు తెల్పింది..

థియేటర్లు ప్రైవేట్‌ ఆస్తులు.. ఆ విషయంలో పూర్తి హక్కు థియేటర్ల యజమానులకు మాత్రమే ఉంటుంది
Outside Food Not Allowed In Movie Theaters
Follow us on

థియేటర్లలోకి బయటి నుంచి తినుబండారాలు, పానియాలు తీసుకెళ్లకుండా నిరోధించే హక్కు సినిమా హాళ్ల యాజమన్యాలకు ఉందని మంగళవారం (జవనరి 3) సుప్రీంకోర్టు తెల్పింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కోసం తీసుకెళ్లే ఆహారాలను మాత్రం థియేటర్లలోకి అనుమతించవచ్చని పేర్కొంది. ఈ మేరకు చీఫ్‌ జస్టీస్‌ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు ఈ రోజు విచారించింది. ‘థియేటర్లు ప్రైవేట్ ఆస్తులు. వీటిలోకి తీసుకెళ్లే ఆహారాలపై నిషేధం విధించడంపై సినిమా హాళ్ల యజమానులకు పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ లోపలికి తినుబండారాలను అనుమతిస్తే.. తిన్నవారు తమ చేతులను కుర్చీలకు తుడిస్తే అనవసరంగా అవి పాడయ్యే అవకాశం ఉంది. ఐతే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా అందించే బాధ్యత థియేటర్‌ యజమానులదేనని’ ధర్మాసనం పేర్కొంది.

కాగా మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తమతో తెచ్చుకునే ఆహారాలు, పానీయాలను సినిమా హాళ్లలోకి తీసుకెళ్లడాన్ని నిరోధించరాదని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత ధర్మాసనం పక్కన పెట్టింది. అలాంటి ఉత్తర్వును జారీ చేయడంలో హైకోర్టు తన అధికార పరిధిని అధిగమించినట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వ్యాపార రంగంలో రూల్‌మేకింగ్‌ నిర్ణయం తీసుకునే హక్కు యజమానులకు ఉంటుందని నొక్కి చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.