AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Krishnaavataram: ఆ ఇద్దరు హీరోల మార్పు.. ఎన్టీఆర్ శ్రీకృష్ణావతారం సినిమా గురించి ఆసక్తికర విషయాలు..

నటరత్న ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణావతారం చిత్రం విశేష స్థానం సంపాదించుకుంది. శ్రీకృష్ణుని జననం నుండి నిర్యాణం వరకు చూపించిన ఈ చిత్ర నిర్మాణానికి ఎన్టీఆర్ దూరదృష్టి కారణం. కాస్టింగ్ లో సవాళ్లు, కథా విస్తరణ, ఒక నిర్మాత విషాద మరణం వంటి ఆసక్తికర సంఘటనలు ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయాయి.

Sri Krishnaavataram: ఆ ఇద్దరు హీరోల మార్పు.. ఎన్టీఆర్ శ్రీకృష్ణావతారం సినిమా గురించి ఆసక్తికర విషయాలు..
Sri Krishnaavataram
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2026 | 8:41 PM

Share

నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన పలు చిత్రాలలో శ్రీకృష్ణావతారం చిత్రానికి ఒక విశేష స్థానం ఉంది. శ్రీకృష్ణుని పుట్టుక నుండి నిర్యాణం వరకు ఆయన అవతారంలోని ముఖ్య ఘట్టాలను, వాటి పూర్వాపరాలతో సహా వీలైనంత విపులంగా ఈ చిత్రంలో చూపించడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల రాయబారిగా శ్రీకృష్ణుడు కౌరవులతో సాగించిన సంధి ప్రయత్నాలను మరే చిత్రంలోనూ చూపించని స్థాయిలో ఈ సినిమాలో చూపించడం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక ముద్ర వేసిన ఈ చిత్రం నిర్మాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన అట్లూరి పుండరీకాక్షయ్యకు ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు ఎన్టీఆర్ ను కలవడం ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది. అలాంటి ఒక రోజు, మహామంత్రి తిమ్మరుసు చిత్రం విడుదలైన నాలుగేళ్ల తర్వాత, ఎన్టీఆర్ పుండరీకాక్షయ్యతో “శ్రీకృష్ణరాయబారం పద్యాల హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కో, ఆ పద్యాలతో సినిమా చేయాలని ఉంది” అని తన అభిలాషను వెల్లడించారు. తిరుపతి వెంకట కవులుగా గుర్తింపు పొందిన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, దివాకర్లు తిరుపతిశాస్త్రి పాండవోద్యోగం పేరుతో రాసిన నాటకంలోని పద్యాలు అవి. పుండరీకాక్షయ్య అన్వేషణ ప్రారంభించి, నెల్లూరులో రామానుజుల శెట్టి దగ్గర ఆ నాటక హక్కులు ఉన్నాయని తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడి హక్కులు కొనుక్కొని వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ ను కలిసి ఆ విషయం తెలియజేశారు. “వెరీ గుడ్. శ్రీకృష్ణరాయబారం పేరుతో సినిమా స్టార్ట్ చెయ్” అని ఎన్టీఆర్ చెప్పారు.

అయితే, కేవలం రాయబార సన్నివేశాలతో సినిమా తీస్తే ప్రేక్షకులకు ఆసక్తి ఉండదని పుండరీకాక్షయ్య సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు ఎన్టీఆర్, “అయితే కృష్ణావతారం అని పేరు పెట్టి, కృష్ణుడి పుట్టుక నుంచి మొదలు రాయబార సన్నివేశాల వరకు చూపించి, గీతోపదేశంతో సినిమాను ముగిద్దాం” అన్నారు. అంత పెద్ద సినిమా తాను తీయగలనా అని పుండరీకాక్షయ్య సందేహం వ్యక్తం చేయగా, “నువ్వే తీయగలవు, నేను ఉన్నాను కదా” అని ఎన్టీఆర్ ఆయనను ఒప్పించారు. ఆయనతో పాటు మరో నిర్మాత తిరుపతయ్యను జతకలిపారు. సముద్రాల రాఘవాచార్యను పిలిచి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. గీతోపదేశంతో సినిమా పూర్తి చేద్దామని ఎన్టీఆర్ మొదట భావించినా, పుండరీకాక్షయ్య “గీతోపదేశం తర్వాత యుద్ధం, అవతారం చాలించడం చూపించాలి కదా” అని వాదించారు. కృష్ణుడి నిర్యాణ సన్నివేశాలను తీయడానికి ఎన్టీఆర్ మొదట్లో ఒప్పుకోకపోయినా, పుండరీకాక్షయ్య నచ్చజెప్పిన తర్వాత అంగీకరించారు.

ఈ సినిమాలో నారదుడి పాత్రకు మొదట కాంతారావును ఎంపిక చేశారు. షూటింగ్ రోజున కారు పంపగా, కడుపునొప్పిగా ఉందని, తర్వాత వస్తానని తిరిగి పంపేశారు. లంచ్ తర్వాత మళ్ళీ కారు పంపితే, రహస్య షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్ వెళ్లారని తెలిసింది. ఇది విని పుండరీకాక్షయ్య షాక్ అయ్యారు. ఆ రోజు ఎన్టీఆర్ కు పని లేకపోవడంతో, సాయంత్రం ఆయన్ను కలిసి ఈ విషయం చెప్పగా, ఎన్టీఆర్ కూడా షాక్ అయ్యారు. “మన విషయంలో కూడా కాంతారావు ఇలా చేశాడా” అని బాధపడిన ఎన్టీఆర్, “నిర్మాతగా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు” అన్నారు. నారదుడి పాత్ర కోసం కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్ పేర్లు చెప్పగా, చివరకు శోభన్ బాబు పేరును ఎన్టీఆర్ ఖరారు చేశారు. నారదుడి పాత్ర కోసం పిలిచారని తెలిసి నిరాశ చెందిన శోభన్ బాబు, రెండు మూడు రోజుల పని అని చెప్పడంతో ఒప్పుకున్నారు.

దుర్యోధనుడి పాత్రకు ఎస్.వి. రంగారావును అనుకున్నారు, ఆయన కూడా అంగీకరించారు. అయితే, షూటింగ్ కు కొద్ది రోజుల ముందు స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారు. అప్పుడు నటుడిగా ఎదుగుతున్న కైకాల సత్యనారాయణకు ఈ అవకాశం దక్కింది. ఈ ఆఫర్ విని ఎగిరి గంతేసిన సత్యనారాయణ, దాదాపు 20 రోజులపాటు డైలాగులు, వాకింగ్, గదాయుద్ధం ప్రాక్టీస్ చేసి సిద్ధమయ్యారు. బాలకృష్ణుడిగా హరికృష్ణ నటించారు. నిమ్మకూరులో తాతగారి దగ్గర ఉంటున్న హరికృష్ణ, ఈ సినిమా కోసం మద్రాస్ వచ్చారు. సెట్లో కొంచెం అల్లరి చేసినా, ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. శ్రీకృష్ణావతారంలో అర్జునుడిగా రామకృష్ణ, ధర్మరాజుగా మిక్కిలినేని, భీముడిగా అజ్జా జనార్ధనరావు, శకునిగా లింగమూర్తి, శిశుపాలుడిగా రాజనాల, కంసుడిగా ముక్కామల, రుక్మిణిగా దేవిక, సత్యభామగా కాంచన, ద్రౌపదిగా ఎస్. వరలక్ష్మి నటించారు. తారకరామా పిక్చర్స్ బ్యానర్ పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం 1967 అక్టోబర్ 12న విడుదలయ్యి విజయం సాధించింది. అయితే, చిత్రం విడుదలైన మూడవ రోజునే నిర్మాతల్లో ఒకరైన తిరుపతయ్య గుండెపోటుతో మరణించడంతో, శతదినోత్సవం జరపలేదు.

Follow Us