అర్నబ్ ముంచుకొస్తుంది.. తీరం దాటేది ఎక్కడంటే..?

×

అర్నబ్ ముంచుకొస్తుంది.. తీరం దాటేది ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్‌కు అర్నబ్ తుఫాను ముప్పు పొంచి ఉంది. తీవ్ర వాయుగుండం బలపడి ‘అర్నబ్’ తుఫానుగా మారింది. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాను ప్రస్తుతం వైజాగ్‌కు 650 కిలోమీటర్లు, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అక్టోబర్ 26 అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా, అక్టోబర్ 27న అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అక్టోబర్ 28న ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. రాబోయే మూడు రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. ప్రజలు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. రాబోయే రెండు రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదు, అలలు చాలా ఉధృతంగా ఉంటాయి. బోట్లు, వలల విషయంలో అధికారులు సూచించిన భద్రతా చర్యలు పాటించాలి. సముద్రపు అలల దగ్గర సెల్ఫీలు దిగడం, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటడం వంటి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. గతంలో ఇలాంటి చర్యల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించి, అప్రమత్తంగా ఉండాలి. ఇది సోమవారం ఉదయం 10 గంటలకు వెదర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన బుల్లెటిన్ ఆధారంగా రూపొందించబడింది.

Phani CH