AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూల్ రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు.. 25 ఏళ్ల తర్వాత చదువుకున్న బడికి అద్భుత గిఫ్ట్..

కలిసి నడిచిన రోజులు.. ఒకే బెంచీపై పంచుకున్న జ్ఞాపకాలు.. కాలం గిర్రున తిరిగినా ఆ బంధం ఏమాత్రం చెక్కుచెదరలేదు.. సరిగ్గా పాతికేళ్ల తర్వాత తమ చిన్ననాటి బడి ముంగిట వాలిన పూర్వ విద్యార్థులు, కేవలం జ్ఞాపకాలను నెమరువేసుకుని వెళ్లిపోలేదు. అక్షరం నేర్పిన ఆ సరస్వతీ నిలయం రుణం తీర్చుకునేలా ఏకంగా రూ. 4 లక్షలు పోగుచేసి సరికొత్త గ్రంథాలయాన్ని నిర్మించి ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: స్కూల్ రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థులు.. 25 ఏళ్ల తర్వాత చదువుకున్న బడికి అద్భుత గిఫ్ట్..
Mallapur Alumni Build School Library
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 8:24 PM

Share

కలిసి చదువుకున్నారు.. ఆడుతూ పాడుతూ ఒకే తరగతి గదిలో తీపి గుర్తులను పంచుకున్నారు. కాలం గడిచింది.. ఎవరి దారిలో వారు జీవితంలో స్థిరపడ్డారు. కానీ అక్షరం నేర్పిన ఆ సరస్వతీ నిలయాన్ని, తీర్చిదిద్దిన గురువులను మాత్రం వారు మరువలేదు. పదో తరగతి పూర్తయి సరిగ్గా పాతికేళ్లు గడిచిన వేళ.. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తిరిగి ఒక్కచోట చేరారు. కేవలం సరదాగా గడిపి వెళ్లిపోకుండా, తమ బడి రుణం తీర్చుకునేలా రూ. 4 లక్షలు పోగుచేసి సరికొత్త గ్రంథాలయాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ అపురూప ఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై.. పూలవర్షంతో గురువులకు స్వాగతం!

మొగిలిపేట ఉన్నత పాఠశాలలో 2001-2002 విద్యాసంవత్సరానికి చెందిన మొట్టమొదటి పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పాఠశాల పూర్తయి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా ఒకరినొకరు కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు. కార్యక్రమానికి విచ్చేసిన తమ గురువులపై పూల వర్షం కురిపిస్తూ విద్యార్థులు ఘనంగా పాఠశాలలోకి ఆహ్వానించారు. గురువులకు పాదాభివందనం చేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. నాటి మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ గురు-శిష్యుల అనుబంధాన్ని చాటారు.

రూ. 4 లక్షలతో ఆధునిక గ్రంథాలయం

ఈ సమ్మేళనాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలని పూర్వ విద్యార్థులు భావించారు. ఈ క్రమంలో దాదాపు 60 మందికి పైగా ఉన్న పూర్వ విద్యార్థులు తలో చేయి వేసి, రూ. 4 లక్షల నిధులను సమీకరించారు. పాఠశాల ఆవరణలో సకల సౌకర్యాలతో ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని నిర్మించారు. తమ చేతుల మీదుగానే విద్య నేర్చుకున్న గురువులతోనే ఈ లైబ్రరీని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు, గ్రామంలోని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అవసరమైన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్‌ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచామని పూర్వ విద్యార్థులు గర్వంగా వెల్లడించారు.

ఉత్సాహంగా సాంస్కృతిక వేడుకలు

గ్రంథాలయ ప్రారంభోత్సవం అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఆటపాటలతో సందడి చేస్తూ నాటి స్కూల్ డేస్‌ను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ‘‘పాతికేళ్లు గడిచినా తాము చదువుకున్న బడిని మరిచిపోకుండా, ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రంథాలయం నిర్మించి ఇవ్వడం ఎంతో గర్వకారణం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను గుర్తుంచుకునే ఇలాంటి పూర్వ విద్యార్థులు సమాజానికి నిజమైన ఆదర్శం’’ అని ప్రశంసించారు.

Follow Us