Telangana: ఇదేందయ్యా ఇదీ.. మహబూబ్ నగర్‌లో వింత వాతావరణం.. జనం ఉక్కిరిబిక్కిరి
వర్షాకాలం వెళ్లిపోతున్నా చెరువులు నిండలేదు.. భూమి తడవలేదు. కనీసం చలికాలంలోనైనా ఉపశమనం దొరుకుతుందనుకుంటే, పాలమూరు ప్రజలకు ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు గ్లోబల్ వార్మింగ్, ఎల్‌నినో ప్రభావం వెరసి.. పాలమూరు జిల్లాలో మునుపెన్నడూ చూడని వింత వాతావరణం నెలకొంది.

వర్షాకాలం వచ్చి వెళ్లిపోయింది.. కానీ ఆశించిన స్థాయిలో వాన జాడే కనిపించలేదు. కనీసం చలికాలంలోనైనా వాతావరణం చల్లబడుతుందనుకుంటే… పాలమూరులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చలికాలం ప్రారంభమైనా ఎండలు మాత్రం మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరుతుండటంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో పాలమూరు వాతావరణంపై చర్చ మొదలైంది. అసలు జిల్లాలో ఎండల తీవ్రతకు కారణాలేంటి? రానున్న రోజుల్లోనైనా వాతావరణం చల్లబడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి చలి మొదలై… వాతావరణం చల్లబడాలి. కానీ పాలమూరు జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చలికాలం ప్రారంభమైనా ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇప్పటికే వర్షాకాలం వచ్చి వెళ్లిపోయింది… కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.
సాధారణంగా వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాలి… పొలాలు పచ్చదనంతో కళకళలాడాలి. కానీ ఈసారి అనేక ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో వర్షాకాలం వచ్చినట్లు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ముగిసింది. చలికాలం ప్రారంభమైంది.. కానీ పాలమూరులో మాత్రం ఎండల తీవ్రత తగ్గడం లేదు. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో వాతావరణం క్రమంగా చల్లబడుతుందని భావిస్తారు. కానీ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరుతుండటంతో వేసవిని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలవుతుండగా.. మధ్యాహ్నానికి వేడి మరింత పెరుగుతోంది. క్యాలెండర్‌లో చలికాలం మొదలైనా.. వాతావరణంలో మాత్రం ఆ మార్పు కనిపించకపోవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఎండలో పనిచేసే కార్మికులు, చిరు వ్యాపారులు, రోడ్లపై ప్రయాణించే వారు వేడి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా చల్లని వాతావరణం ఉండాల్సిన సమయంలోనూ ఎండలు మండుతుండటంతో రోజువారీ పనులు చేసుకోవడమే ఇబ్బందిగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు.
మరోవైపు ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పులపై చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లోనైనా పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా.. వర్షాకాలం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, చలికాలంలోనూ ఎండలు మండుతుండటంతో పాలమూరులో వాతావరణం అంతుచిక్కడం లేదు.
