AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధభూమిలో నరకయాతన.. తన పాదాన్ని నరుక్కున్న ఉక్రెయిన్ సైనికుడు.. !

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ సైనికుడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. శత్రువుల దాడులు.. తీవ్ర గాయాలు.. కనీసం కదల్లేని పరిస్థితి.. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడు 8 నెలలు యుద్ధభూమిలో నరకయాతన అనుభవించాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి చివరకు తన పాదాన్ని నరుక్కున్నాడు. యుద్ధభూమి నుంచి ఆ సైనికుడిని భారీ డ్రోన్ సాయంతో గాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతానికి తరలించింది ఉక్రెయిన్ సైన్యం.  

యుద్ధభూమిలో నరకయాతన.. తన పాదాన్ని నరుక్కున్న ఉక్రెయిన్ సైనికుడు.. !
Ukrainian Soldier Cuts Off His Own Foot To Survive
Sharada V
|

Updated on: Oct 26, 2026 | 7:44 PM

Share

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ సైనికుడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. శత్రువుల దాడులు.. తీవ్ర గాయాలు.. కనీసం కదల్లేని పరిస్థితి.. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికుడు 8 నెలలు యుద్ధభూమిలో నరకయాతన అనుభవించాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి చివరకు తన పాదాన్ని నరుక్కున్నాడు. యుద్ధభూమి నుంచి ఆ సైనికుడిని భారీ డ్రోన్ సాయంతో గాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతానికి తరలించింది ఉక్రెయిన్ సైన్యం.

రష్యా డ్రోన్ దాడి.. సైనికుడికి తీవ్ర గాయాలు

ఉక్రెయిన్‌కు చెందిన సైనికుడు వ్లాసెంకో గత ఏడాది మే నెలలో యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అక్కడ బాస్కీ అని పిలిచే మరో సైనికుడితో కలిసి విధులు నిర్వర్తించాడు. వీరిద్దరూ ఓ చిన్న బంకర్‌లో ఉంటూ, డ్రోన్ల ద్వారా అందించే ఆహారం, ఇతర అవసరమైన వస్తువులపై ఆధారపడ్డారు. శరదృతువులో సైనికులను మార్చాల్సిన సమయం వచ్చింది. అయితే, వారి స్థానంలో విధులు చేపట్టేందుకు వచ్చిన ఇద్దరు సైనికులు మార్గమధ్యంలో రష్యా దాడుల్లో మరణించారు. వారి మృతదేహాలను తీసుకురావడానికి వెళ్లిన మరో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వ్లాసెంకో, బాస్కీ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

దాదాపు పది నెలల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరూ ఫిబ్రవరిలో మరో సమస్యను ఎదుర్కొన్నారు. వారు ఉంటున్న బంకర్‌లోకి నీరు చేరడంతో సమీపంలోని శిథిలమైన పాఠశాలలోకి వెళ్లి ఆశ్రయం పొందారు. అయితే, కొద్దిరోజులకే ఆ భవనంపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో బాస్కీ ప్రాణాలు కోల్పోగా.. వ్లాసెంకో తీవ్రంగా గాయపడ్డాడు.

కదల్లేని పరిస్థితి.. ప్రాణాల కోసం పాదాన్ని నరుక్కున్నాడు!

డ్రోన్ దాడిలో వ్లాసెంకో ఎడమ పాదం పూర్తిగా దెబ్బతింది. కుడి కాలుకు కూడా తీవ్ర గాయమైంది. ఎముక బయటకు కనిపించేంతగా కాలు దెబ్బతినడంతో కదలడం కష్టంగా మారింది. దీంతో పాఠశాలలోని బాయిలర్ గది కింద ఉన్న ప్రాంతంలో తలదాచుకున్నాడు. అయితే, వైద్యం అందక అతడి పరిస్థితి రోజురోజుకూ దిగజారింది. అక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం కనిపించలేదు. సహాయం అందుతుందన్న ఆశ కూడా తగ్గింది. చివరకు ప్రాణాలు కాపాడుకోవడానికి పాదాన్ని కత్తితో నరుక్కున్నాడు. రక్తస్రావాన్ని నియంత్రించడానికి టోర్నికెట్‌ (రక్తస్రావం ఆపేందుకు ఉపయోగించే బిగింపు పరికరం) ఉపయోగించాడు.

ఖార్కివ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్లాసెంకో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ పాదం నేలపై రాసుకుంటూ పోయిందనీ ఎముక కూడా బయటకు కనిపించిందనీ కాబట్టి దాన్ని కోయాల్సి వచ్చిందనీ అన్నాడు. అప్పుడు తనకు రెండు కాళ్లూ లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.  ‘నేను అప్పటికే నా అంత్యక్రియలు జరిగినట్లుగా భావించాను. ఇక బతికే ఆశ లేదని అనుకున్నా’ అని ఆవేదనగా చెప్పాడు.

సైనికుడిని రక్షించడం అసాధ్యం అనుకున్న అధికారులు

యుద్ధభూమిలో గాయపడిన సైనికులను బయటకు తీసుకురావడం ఉక్రెయిన్ సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. సైనికులను తరలించేందుకు వెళ్లే వాహనాలపై రష్యా డ్రోన్లు దాడులు చేసే ప్రమాదం ఉండటంతో పికప్ ట్రక్కులు, సాయుధ వాహనాల ద్వారా తరలింపు దాదాపు అసాధ్యంగా మారింది. వ్లాసెంకోను రక్షించేందుకు ఉక్రెయిన్ సైన్యం పలుమార్లు ప్రయత్నించింది. చక్రాలు లేదా ట్రాక్‌లతో నడిచే మానవరహిత భూతల వాహనాలను కూడా పంపించింది. కానీ, అతడిని చేరుకోవడానికి వెళ్లిన రెండు వాహనాలను రష్యా డ్రోన్లు ధ్వంసం చేశాయి.దీంతో సైనికాధికారులు మరో మార్గాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చెందిన గుర్జుఫ్ డిఫెన్స్ (Gurzuf Defense) సంస్థ అభివృద్ధి చేస్తున్న భారీ డ్రోన్ గురించి వారికి తెలిసింది. దానిని ఉపయోగించి వ్లాసెంకోను గాలిలోనే తరలించాలని నిర్ణయించారు.

70 మీటర్ల ఎత్తులో.. 15 కిలోమీటర్ల ప్రయాణం!

ఈ భారీ డ్రోన్‌కు ఆరు నిలువు రోటర్లు ఉన్నాయి. నల్లటి ఫ్రేమ్‌తో ఉండే ఈ యంత్రం భారీ కీటకంలా కనిపిస్తుంది. దాదాపు 90 కిలోల బరువును మోస్తూ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. ఏడాదికి పైగా యుద్ధభూమిలో ఉండటంతో వ్లాసెంకో బరువు సుమారు 70 కిలోలకు తగ్గిపోయిందని అధికారులు అంచనా వేశారు. అక్టోబర్ లో అతడికి పంపిన ఆహారంలో ఓ ప్రత్యేకమైన పార్సిల్ పంపించారు. అందులో సైనికుడి శరీరానికి బిగించుకునే హార్నెస్‌, దాన్ని ఎలా ఉపయోగించాలో వివరించే వీడియోలు ఉన్న ఫోన్ ఉన్నాయి.

భారీ డ్రోన్ అతడున్న ప్రాంతానికి చేరుకుంది. డ్రోన్ కింద ఉన్న వించ్‌కు అనుసంధానించిన కారబైనర్‌కు వ్లాసెంకో తనను తాను బిగించుకున్నాడు. ఆ తర్వాత డ్రోన్ అతడిని దాదాపు 70 మీటర్ల ఎత్తుకు ఎత్తి, సురక్షిత ప్రాంతం వైపు ప్రయాణం ప్రారంభించింది.

Ukrainian Soldier Cuts Off His Own Foot To Survive Rescued By Drone After 8 Months

Ukrainian Soldier Cuts Off His Own Foot To Survive Rescued By Drone After 8 Months 

ఈ ఆపరేషన్‌లో శత్రు డ్రోన్ల నుంచి రక్షణ కల్పించేందుకు మరో మూడు చిన్న డ్రోన్లు కూడా తోడుగా వెళ్లాయి. అదే సమయంలో ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ఎఫ్‌పీవీ డ్రోన్ బృందాలు, ఫిరంగి దళాలు, పెద్ద ఫిక్స్‌డ్-వింగ్ డ్రోన్లు రష్యా డ్రోన్లు ఉన్న ప్రాంతాలపై దాడులు చేశాయి.  రెండు గంటల పాటు సాగిన ఆపరేషన్ లో అవసరమైన మార్గాన్ని సురక్షితం చేసేందుకు ప్రయత్నించారు. చివరకు దాదాపు 15 నిమిషాల ప్రయాణం తర్వాత భారీ డ్రోన్ వ్లాసెంకోను సురక్షిత ప్రాంతానికి చేర్చి క్షేమంగా కిందకు దించింది.

నీటిలో పడిపోతానేమో అని భయపడ్డా!

డ్రోన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఎదురైన భయాన్ని వ్లాసెంకో వివరించాడు.  డ్రోన్ నుంచి కిందపడిపోతానేమోనని ఆందోళన చెందినట్లు చెప్పాడు. ‘అడవిలో పడిపోతే అంతగా భయపడేవాడిని కాదు. కానీ నీటిలో పడిపోతానేమోనని భయపడ్డాను. ఎందుకంటే నాకు ఈత రాదు’ అన్నాడు.

యుద్ధంలో డ్రోన్ల వినియోగానికి కొత్త ఉదాహరణ

ఇప్పటివరకు యుద్ధంలో డ్రోన్లను ప్రధానంగా నిఘా, దాడులు, ఆయుధాలు, ఆహారం, ఇతర సరుకుల సరఫరా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే, సంప్రదాయ వాహనాలు వెళ్లలేని ప్రమాదకర ప్రాంతాల నుంచి గాయపడిన సైనికులను రక్షించేందుకు కూడా వీటిని ఉపయోగించవచ్చని ఈ ఘటన నిరూపించింది. భారీ డ్రోన్‌తో సైనికుడిని గాలిలో ఎత్తి తరలించి రక్షించిన తొలి ఘటన ఇదే అని ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. యుద్ధభూమిలో మానవరహిత యంత్రాల వినియోగం భవిష్యత్తులో గాయపడిన సైనికుల ప్రాణాలను కాపాడటంలో ఎంత కీలకంగా మారవచ్చో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Follow Us