Story Writing Tips: క్రైమ్ కథా రచనపై ఉచిత కోర్సు.. నాలుగు వారాలే!
Free Online Course:: ఓ హత్య.. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు.. ఒక్కో క్లూ తో మారిపోయే కథ.. చివర్లో అందరినీ ఆశ్చర్యపరిచే ట్విస్ట్! మర్డర్ మిస్టరీ నవలల్లో ఇలాంటి ఉత్కంఠే పాఠకులను పుస్తకానికి కట్టిపడేస్తుంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే చివరి పేజీ వరకు ఆపాలనిపించదు. అసలు రచయితలు ఇలాంటి కథలను ఎలా అల్లుతారు? పాఠకుడికి ముందే నేరస్థుడు ఎవరో తెలిసిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కథలో ఉత్కంఠను ఎక్కడ పెంచాలి? పాత్రల మధ్య అనుమానాలను ఎలా సృష్టించాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను నేర్చుకోవాలనుకునేవారికి గ్లాస్గో యూనివర్సిటీ ఓ మంచి అవకాశం కల్పిస్తోంది. క్రైమ్ ఫిక్షన్ రచనలోని మెళకువలను పరిచయం చేసేందుకు నాలుగు వారాల ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది.

మర్డర్ మిస్టరీ కథలో హత్య జరిగినంత మాత్రాన అది ఆసక్తికరంగా మారదు. ఆ హత్య వెనుక ఉన్న రహస్యం, అనుమానితుల మధ్య సంబంధాలు, ఒక్కో ఆధారం బయటపడే తీరు.. ఇవన్నీ పాఠకుడిని కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఈ కోర్సులో అలాంటి కథలను రూపొందించడానికి అవసరమైన మూడు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అవే కథా నిర్మాణం (Plot), పాత్రల రూపకల్పన (Character), కథనా శైలి (Narrative). ఓ హత్య చుట్టూ కథను ఎలా ప్రారంభించాలి? మొదటి నుంచే పాఠకుల్లో ఆసక్తిని ఎలా రేకెత్తించాలి? డిటెక్టివ్ పాత్రను ఎలా తీర్చిదిద్దాలి? నేరస్థుడి అసలు రూపాన్ని చివరి వరకు ఎలా దాచాలి? కథలో క్లూలను ఏ సమయంలో బయటపెట్టాలి? అనూహ్యమైన మలుపులతో పాఠకులను ఎలా ఆశ్చర్యపరచాలి? వంటి అంశాలను ఇందులో నేర్పిస్తారు. తేకాదు.. ప్రముఖ క్రైమ్ నవలల్లోని కొన్ని భాగాలను చదివి వాటి పద్ధతులపై చర్చిస్తారు. నిజ జీవితంలో జరిగే నేరాలు, సామాజిక సమస్యలు కల్పిత కథలకు ఎలా ప్రేరణగా మారతాయో కూడా వివరిస్తారు.
స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో యూనివర్సిటీ అందిస్తున్న ఈ కోర్సు పేరు ‘టార్టాన్ నాయర్: స్కాటిష్ క్రైమ్ రైటింగ్’ (Tartan Noir: Scottish Crime Writing). ఫ్యూచర్లెర్న్ (FutureLearn) ఆన్లైన్ వేదికగా ఈ కోర్సు అందుబాటులో ఉంది. క్రైమ్ నవలలు చదివేవారే కాదు.. సొంతంగా కథలు రాయాలనుకునేవారు, రచయితలుగా ఎదగాలనుకునేవారు కూడా ఇందులో చేరవచ్చు. ఈ కోర్సు మొత్తం నాలుగు వారాలు కొనసాగుతుంది. ప్రతి వారం సుమారు ఐదు గంటలు కేటాయిస్తే సరిపోతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రాథమిక కోర్సుకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. అయితే సర్టిఫికెట్, అదనపు ఫీచర్లు, ఎక్కువకాలం కోర్సును చూసే సదుపాయం వంటి వాటికి చార్జీలు ఉండవచ్చు.
షెర్లాక్ హోమ్స్ నుంచి ఆధునిక క్రైమ్ థ్రిల్లర్ల వరకు!
క్రైమ్ కథల రచనలో స్కాట్లాండ్కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ కోర్సులో ఆ సాహిత్య ప్రయాణాన్ని కూడా పరిచయం చేస్తారు. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త ఆర్థర్ కోనన్ డోయల్ వంటి దిగ్గజ రచయితల రచనల నుంచి మొదలుపెట్టి.. నేటి ప్రముఖ క్రైమ్ రచయితల పుస్తకాల వరకు విశ్లేషిస్తారు. యాన్ రాంకిన్, వాల్ మెక్డెర్మిడ్, డెనిస్ మినా వంటి రచయితలు తమ కథల్లో ఉత్కంఠను ఎలా పెంచారు? అనుమానిత పాత్రలను ఎలా పరిచయం చేశారు? పాఠకుడి అంచనాలను తలకిందులు చేసే మలుపులను ఎలా సృష్టించారు? వంటి విషయాలను వారి రచనల ఆధారంగా తెలుసుకోవచ్చు.
ప్రముఖ రచయితల అనుభవాలు.. సలహాలు కూడా!
ఈ కోర్సుకు గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన స్కాటిష్ లిటరేచర్ ప్రొఫెసర్ గెరార్డ్ కారుథర్స్, స్కాటిష్ స్టడీస్ లెక్చరర్ డాక్టర్ క్రెయిగ్ లామోంట్ నాయకత్వం వహిస్తున్నారు. క్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రముఖ క్రైమ్ రచయితలు లూయిస్ వెల్ష్, క్రిస్టోఫర్ బ్రూక్మైర్, లిన్ ఆండర్సన్, లియామ్ మెక్ఇల్వానీ కూడా ఈ కోర్సులో భాగస్వాములు కానున్నారు. తమ రచనా అనుభవాలను, కథలు రాసేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను, పాఠకులను ఆకట్టుకునే పద్ధతులను వారు పంచుకోనున్నారు.
ఆసక్తి ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోండి!
క్రైమ్ నవలలు చదవడమే కాకుండా.. వాటి వెనుక ఉన్న రచనా రహస్యాలను తెలుసుకోవాలనుకునేవారు ఫ్యూచర్లెర్న్ (FutureLearn) వెబ్సైట్లో ‘Tartan Noir: Scottish Crime Writing’ పేరుతో కోర్సును వెతికి రిజిస్టర్ చేసుకోవచ్చు. నాలుగు వారాల పాటు వారానికి ఐదు గంటలు కేటాయిస్తే.. క్రైమ్ కథల నిర్మాణం, పాత్రల రూపకల్పన, ఉత్కంఠభరితమైన కథనం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. ముఖ్యంగా సొంతంగా మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్లు రాయాలనుకునేవారికి ఇది మంచి ప్రారంభం కావచ్చు. ఇకపై క్రైమ్ నవల చదివేటప్పుడు కథలోని ట్విస్టులనే కాదు, వాటిని రచయిత ఎలా సృష్టించారో కూడా అర్థం చేసుకునే అవకాశం ఈ కోర్సు కల్పిస్తోంది.



