Aishwarya Rai: పెళ్లయిన ప్రతి స్త్రీకి ‘సైలెన్స్’ ఒక వరం! భార్య ఎప్పుడూ కరెక్టే అంటున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్
వివాహ బంధం అంటే కేవలం పూలబాట కాదు, అప్పుడప్పుడు ఎదురయ్యే ముళ్లు కూడా. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో ఉండే సెలబ్రిటీల మధ్య గొడవలు, విభేదాలు రావడం సహజం. కానీ దశాబ్ద కాలానికి పైగా అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న ఒక జంట గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న ఆ నటి, తన వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఒక వింత చిట్కా పాటిస్తారట. ఆ చిట్కా వింటే పెళ్లయిన ప్రతి మహిళ “ఇది నిజమే కదా” అని ఒప్పుకోక తప్పదు. గొడవలు జరిగినప్పుడు ఎదురుదాడి చేయడం కంటే, ఒక చిన్న పని చేస్తే భర్త తనంతట తానుగా వచ్చి క్షమాపణ చెబుతాడని ఆమె నమ్ముతారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్?
మౌనమే నీ భాష..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ ఈ తరానికి ఒక అమూల్యమైన సలహా ఇచ్చారు. “పెళ్లయిన స్త్రీ జీవితంలో మౌనం అనేది బంగారం లాంటిది” అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది వినడానికి సరదాగా అనిపించినా, దీని వెనుక ఒక లోతైన అర్థం ఉందని ఆమె అభిప్రాయం. గొడవ జరిగినప్పుడు వాదించడం కంటే మౌనంగా ఉండటం వల్ల ప్రేమ గెలుస్తుందని ఆమె నమ్ముతారు. ఇది మొండితనం కాదు, బంధం నిలబడటానికి చేసే ఒక తెలివైన ప్రయత్నం అని ఐశ్వర్యరాయ్ స్పష్టం చేశారు.
అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే?
గతంలో కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొన్నప్పుడు అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని సరదా నిజాలు పంచుకున్నారు. “మా మధ్య ఏదైనా గొడవ జరిగితే ఎప్పుడూ నేనే ముందుగా వెళ్లి క్షమాపణ చెబుతాను. పెళ్లయిన ప్రతి పురుషుడికి ఇది అనుభవమే. భార్యలు ఎప్పుడూ ముందుగా సారీ చెప్పరు” అని నవ్వుతూ చెప్పారు. అంతేకాదు, వైవాహిక జీవితంలో భార్య ఎప్పుడూ కరెక్టేనని, భర్త తన అహాన్ని పక్కన పెట్టి క్షమాపణ చెప్పి ముందుకు సాగడమే ఉత్తమమని అభిషేక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Abhishek & Aishwarya
రూమర్స్‌కి చెక్..
మనోవిజ్ఞాన నిపుణుల అభిప్రాయం ప్రకారం, గొడవ జరిగినప్పుడు స్పందించకుండా కాసేపు మౌనంగా ఉండటాన్ని ‘ఎమోషనల్ రెగ్యులేషన్’ అంటారు. మౌనంగా ఉండటం వల్ల నోటి నుండి వచ్చే కఠినమైన పదాలను అదుపు చేయవచ్చు. భార్య మౌనంగా ఉన్నప్పుడు, భర్త తన తప్పును తాను తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గెలవడం లేదా ఓడిపోవడం గురించి కాదు, ఒక టీమ్‌లా కలిసి ఉండటం గురించి అని ఐశ్వర్యరాయ్ నమ్ముతారు.
ఇటీవల వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని వార్తలు షికారు చేసినప్పటికీ, ఈ జంట మాత్రం తమ బంధం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతున్నారు. బాలీవుడ్ లోని గందరగోళం మధ్య కూడా వీరిద్దరూ తమ ప్రేమను కాపాడుకుంటూ వస్తున్నారు. గ్లామర్ కంటే కూడా పరస్పర గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడమే తమ సక్సెస్ సీక్రెట్ అని వీరి ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది. అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యరాయ్ ల జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అహం కంటే అనుబంధం ముఖ్యమని నమ్మే ఏ జంట అయినా సుఖంగా ఉండగలరు.
