West Bengal Election 2021: కేంద్ర బలగాలపై విద్వేష ప్రసంగం..మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు
West Bengal Election 2021: కేంద్ర బలగాలపై చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై వివరణ కోరుతూ తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రచార సభల్లో కేంద్ర బలగాలపై చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై వివరణ కోరుతూ తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు సృష్టిస్తే మహిళలు కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలంటూ మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాల సాయంతో పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు కుట్రలుపన్నుతున్నారని..హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాపై ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
కేంద్ర భద్రతా బలగాలపై ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఈసీ…దీనిపై శనివారం ఉదయం 11 గం.ల కల్లా వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. భద్రతా బలగాలపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ పోలీసులు, కేంద్ర బలగాల మధ్య అగాధం సృష్టించేలా మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది.
గత రెండు రోజుల వ్యవధిలో మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజు నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. అంతకు ముందు ఈ నెల 3న హుగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మతం ప్రాతిపదికన మమతా బెనర్జీ ఓట్లు అడిగారన్న ఆరోపణలపై ఆమెకు ఈసీ బుధవారం నోటీసు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం జరగనుంది. మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనుండగా…ఓట్ల లెక్కింపును మే 2న చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి…సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలి.. విద్యార్థులకు మద్దతు పలికిన ప్రియాంక గాంధీ..