Bengal Elections: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?

ఒక్క నినాదం.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కుదిపేస్తోంది. ఏ పార్టీ నేత ప్రచారానికి వెళ్ళినా ఆ మాట అతని నోటి వెంట రావాల్సిందే. ఇలా వుంది బెంగాల్ ఎన్నికల ప్రచారం సరళి.

Bengal Elections: ఒక్క నినాదం.. బెంగాల్ ఎన్నికలను కుదిపేస్తోంది.. ఎవరి నోట విన్నా అదే మాట.. ఇంతకీ ఏంటది?
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 09, 2021 | 3:46 PM

One Slogan shaking Bengal Election campaign: ఒక్క నినాదం.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కుదిపేస్తోంది. ఏ పార్టీ నేత ప్రచారానికి వెళ్ళినా ఆ మాట అతని నోటి వెంట రావాల్సిందే. ఇలా వుంది బెంగాల్ ఎన్నికల ప్రచారం సరళి. బహిరంగ సభల్లో, ర్యాలీలతోపాటు ఇంటింటి ప్రచారంలోను ఇదే నినాదం మారుమోగుతోంది. మరో 18 రోజుల్లో తొలి విడత పోలింగ్ జరగనున్న తరుణంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల నేతలంతా ముక్తకంఠంతో పలుకుతున్న మాట.. లేవనెత్తుతున్న నినాదం.. ఒక్కటే..

ఖేలా హోబె.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తరచూ వినిపిస్తున్న నినాదం. ఏ పార్టీ నేత అయినా అతని నోటి నుంచి ఈ మాటే వినిపిస్తోంది. బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ప్రధాన నినాదంగా మారుమోగుతోంది. ఇంతకీ ఖేలా హోబె అంటే అర్థం ‘ఆట మొదలైంది’ అని. రాష్ట్రంలో అధికార పీఠం కోసం పొలిటికల్ వార్ ప్రారంభమైందన్నది ఈ నినాదం వెనుక ఉద్దేశం. పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు తూటాల్లాంటి మాటలను ఉపయోగిస్తున్నారు. ఖేలా హోబెతో పాటు మరికొన్ని నినాదాలు బెంగాల్ ఎన్నికలకు ఊపేస్తున్నాయి. కానీ వాటన్నింటి కంటే ఖేలా హోబెనే విపరీతంగా నేతల నోళ్ళల్లో నానుతోంది. ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

బంగ్లాదేశ్‌ నుంచి అరువు తెచ్చుకున్న నినాదమంటూ ‘ఖేలా హోబె’ నినాదాన్ని మొదట్లో భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. కానీ ఆ తర్వాత అదే నినాదాన్ని బీజేపీ నేతలు అందుకున్నారు. రాజకీయాలను యుద్ధరంగంగా మార్చేందుకు తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్ అందుకున్న ఆటమొదలైంది సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కమలనాథులు ప్రకటించారు. బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ‘‘ఆట మొదలైంది. మార్పు వస్తుంది’’ అని ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్ ఆట పూర్తయిందన్నది ఆయన ఉద్దేశం. ఫిబ్రవరిలో హుగ్లీలో బీజేపీ కండక్ట్ చేసిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి ముందు అక్కడ వేచి ఉన్న కార్యకర్తలు ‘ఖేలా హోబె’ అంటూ చేసిన నినాదంతో సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. కమ్యూనిస్టు నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ‘ఆట మొదలైంది’ నినాదాన్ని తమ ప్రచారంలో తెగ వాడేస్తున్నారు.

‘ఖేలా హోబె’ (ఆట మొదలైంది) నినాదాన్ని మొట్టమొదటిసారి బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ పార్టీ ఎంపీ షమీమ్‌ ఉస్మాన్‌ కొన్నేళ్ల క్రితం వినియోగించారు. అయితే ఈ నినాదం ఎక్కువ పాపులర్ అయ్యింది మాత్రం బెంగాల్ ఎన్నికల్లోనే. తృణమూల్‌ కాంగ్రెస్‌ బీర్‌భూమ్‌ జిల్లా అధ్యక్షుడు అనుబ్రతా మొండల్‌ స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ఆట మొదలైంది. ఇది ప్రమాదకర ఆట’’ అని వ్యాఖ్యానించారు. ఆనాటి నుంచి తృణమూల్‌ నేతలు ప్రతిరోజు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆ నినాదాన్ని వల్లిస్తున్నారు. బీజేపీకి సవాళ్ళు విసురుతున్నారు. ఆ తర్వాత ‘ఆట మొదలైంది’ నినాదం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోవడంతో టీఎంసీ నేతలు మరో అడుగు ముందుకేశారు. ఆటమొదలైంది అనే నినాదాన్ని కాస్తా పాటగా మార్చారు. ఆ పాటలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు స్థానికులు, బయటి శక్తుల మధ్య పోరుగా అందులో అభివర్ణించారు. ‘‘బయటివాళ్లు నెలకోసారి రాష్ట్రంలో పర్యటిస్తారు. కానీ, నీవు-నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాం స్నేహితుడా.. ఆట మొదలైంది..’’ అంటూ ఆ పాట సాగుతుంది. పనిలో పనిగా తమ నేతలపై జోరందుకున్న ఆపరేషన్ కమలాకర్ష్‌ను ఆ పాటలో దుయ్యబట్టారు. బీజేపీలో చేరుతున్న టీఎంసీ నాయకులపై అక్కసు వెల్లగక్కారు. బీజేపీని బెంగాల్‌ వెలుపలి శక్తిగా టీఎంసీ నేతలు అభివర్ణిస్తున్నారు. అందుకే ‘బెంగాల్‌కు తమ సొంత బిడ్డే కావాలి’ అన్న నినాదాన్ని టీఎంసీ అధినేత మమతాబెనర్జీ తెర మీదికి తెచ్చారు. టీఎంసీనే మరోసారి గెలిపించాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

కమలనాథులు తక్కువ తినలేదు..

ఇటు బీజేపీ నేతలు కూడా నినాదాలను బాగానే వినియోగిస్తున్నారు. పందొమ్మిదవ శతాబ్ధంలో వామపక్షాలు బలంగా వున్న ఇటలీలో బాగా పాపులర్ అయిన.. ‘బెల్లా సియావో’ అనే ట్యూన్‌తో బీజేపీ శ్రేణులు ‘పిషి జావో, పిషి జావో’ అనే నినాదాన్ని అందుకున్నారు. దీనర్థం మమత బెనర్జీ బెంగాల్‌ను వీడి వెళ్లాలని. తాజాగా ‘రెండు ఇంజిన్ల సర్కారు’ అనే నినాదాన్ని బీజేపీ వర్గాలు తెరమీదికి తెచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతుందని బీజేపీ నేతలు తమ ప్రసంగాలలోను, ఇంటింటి ప్రచారంలో తరచూ వల్లిస్తున్నారు. దానికి తోడు బీజేపీ చిరకాల నినాదం ‘జై శ్రీరామ్‌’ను కూడా కాషాయదళం బాగానే ఉపయోగిస్తోంది.

కమలదళం ఇచ్చిన ‘రెండు ఇంజిన్ల సర్కారు’ నినాదానికి తృణమూల్‌ ఎంపీ, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మమతా బెనర్జీకి చెందిన ఒక్క ఇంజిన్‌ను ఓడించడానికి భాజపా 500 ఇంజిన్లను రాష్ట్రంలో మోహరించింది’’ అని ఎగతాళిగా కామెంట్ చేశారు అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీ స్వయంగా ‘ఖేలా హోబె’ నినాదాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. ‘‘ఆట మొదలైంది. నేనే గోల్‌కీపర్‌ను. ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని ప్రచార కార్యక్రమంలో దీదీ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్రత్యేక నినాదాలతో ప్రజల్లో ఉత్సాహం నింపడంతోపాటు ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు ప్రచారకర్తలు. మాటల తూటాలతోపాటు పాటల పంచులతో బెంగాల్ ఎన్నికల ప్రచారం ప్రజాకర్షకంగా కొనసాగుతోంది. ఈ నినాదాలు, పొలిటికల్ పంచుల ప్రభావం ఎవరి మీద ఎలా పడుతుందో మే రెండో తేదీన ఫలితాల తర్వాత గానీ తేలేది కాదు.

ALSO READ: పెట్టుబడుల ఉపసంహరణ ఆగదంటున్న కేంద్రం.. దేశంలో ఇప్పటి వరకు డిజిన్వెస్టుమెంటు ప్రాసెస్ ఇదే!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.