పశ్చిమ బెంగాల్‌లో దీదీదే హవా.. పుంజుకున్న బీజేపీ బలం.. ఏబీపీ సీ-ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడి
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏబీపీ(ఆనంద బజార్ పత్రిక) న్యూస్, సీ ఓటర్ సర్వే నిర్వహించింది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏబీపీ(ఆనంద బజార్ పత్రిక) న్యూస్, సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికారం నిలుపుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, పశ్చిమబెంగాల్ ఓటర్లు మళ్లీ దీదీ మమత వైపే మొగ్గు చూపుతున్నట్లు ఓటరు సర్వేలో తేలింది. 148 సీట్ల మేజిక్ ఫిగర్‌ను దాటి 158 స్థానాల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం ఢంకా మోగిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే, 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్- కాంగ్రెస్ కూటమి కలిసి 211 స్థానాల్లో గెలిచి, క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
బెంగాల్ కోటలో కాషాయ జెండా ఎగురువేయాలని భావిస్తోన్న కమలనాథులకు ఆశాభంగం తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగాల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న బీజేపీ ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయని సర్వే చెబుతోంది. మళ్లీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారం పీఠం కైవసం చేసుకుంటుందని నివేదించింది. బీజేపీకి రెండో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని ఓటర్ సర్వేలు విశ్లేషిస్తున్నాయి.
మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ 146 నుంచి 162 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక, బీజేపీకి 99 నుంచి 115 స్థానాలతో రెండో స్థానానికి పరిమితవుతుందని తెలిపింది. ఇక, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి 29 నుంచి 37 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే, హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో మాత్రం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 160 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తేలింది.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ 211 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి సీట్లు తగ్గినా అధికారం మాత్రం నిలబెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో బీజేపీ గణనీయంగా సీట్లను సాధించనుందని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి అనూహ్యంగా పుంజుకుని.. 100కు పైగా గెలవనుందని సర్వే అంచనా వేసింది. అంచనా వేసినట్టు ఫలితాలు వస్తే బెంగాల్‌లో బలమైన ప్రతిపక్షంగా బీజేపీ నిలవనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకుగానూ బీజేపీ 18 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక, కాంగ్రెస్- వామపక్ష కూటమి 29 నుంచి 37 సీట్లతోనే సరిపెట్టుకుంటుందని ఓటర్ సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 43 స్థానాల్లో విజయం సాధించింది. బెంగాల్‌లో లెఫ్ట్, ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్‌తో కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీచేస్తోంది. ఇక, ఓట్ల శాతానికి వస్తే టీఎంసీ, బీజేపీ మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుందని అంచనా వేసింది. గతం కంటే 2 శాతం తగ్గి టీఎంసీకి 42.2 శాతం ఓట్లు, 10 శాతం పెరుగుదలతో బీజేపీకి 37.5 శాతం ఓట్లు దక్కనున్నట్టు తెలిపింది. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 14.8 శాతం ఓట్లు మాత్రమే దక్కనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి సూచనల మేరకు పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, సర్వేలు ఎలా ఉన్నా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.