Tamilnadu Politics: ప్రత్యేక కోర్టులో దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ వ్యూహంపై ఇపుడు ఉత్కంఠ
తమిళనాడులో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ ఇంటరెస్టింగ్‌గా మారుతోంది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ మీద పెద్దరికం చేద్దామనుకున్న శశికళ, ఆమె అనుంగు సహచరుడు టిటికే దినకరన్…
Tamilnadu Politics taking interesting turn: తమిళనాడులో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ ఇంటరెస్టింగ్‌గా మారుతోంది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ మీద పెద్దరికం చేద్దామనుకున్న శశికళ, ఆమె అనుంగు సహచరుడు టిటికే దినకరన్ కాలగమనంలో షాకింగ్ నిర్ణయాలతో రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నారు. జైలు నుంచి తిరిగొచ్చిన చిన్నమ్మ అన్నా డిఎంకే పగ్గాలను ఈజీగా లాగేసుకుంటుందని అనుకుంటే.. అందుకు భిన్నంగా చిన్న పాటి ప్రయత్నాలు ఫెయిల్ కాగానే ఆమె రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నారు. అన్నా డిఎంకేపై హక్కు తమదంటూ కొత్తగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ చెల్లదంటూ కోర్టుకెక్కిన దినకరన్ తాజాగా ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు, ఈ కేసు నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్టు దినకరన్ కోర్టుకు తెలియజేశారు.
జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీపై పట్టుకు ప్రయత్నించిన శశికళ తనను తాను పార్టీ ప్రధాన కార్యదర్శి (జయలలిత హోదా)గా ప్రకటించుకున్నారు. 2017 నుంచి ఆమె పార్టీపై పట్టుకు తీవ్రంగా యత్నిస్తూనే వున్నారు. అయితే అప్పట్లో పెద్దగా బలం లేని పన్నీరు సెల్వం, ఫళనిస్వామి చిన్నమ్మ యత్నాలను పూర్తిగా అడ్డుకోలేకపోయారు. ఈ క్రమంలోనే శశికళ ప్రతినిధిగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని టీటీకే దినకరన్ చేపట్టారు. అయితే, పన్నీరు సెల్వం, ఫళని స్వామిల ఎదురు చూపులు శశికళ జైలుకు వెళ్ళడంతో ఫలించాయి. చిన్నమ్మ అలా జైలుకు వెళ్ళిందో లేదో వీరిద్దరు సఖ్యతకు వచ్చారు. పార్టీపై పట్టు సాధించడంతోపాటు పార్టీలో చిన్నమ్మ అనుచరుల సంఖ్యను కుదించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి వెలివేశారు. పార్టీ బైలాస్ మార్చేశారు. ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. సమన్వయ కమిటీ పేరుతో ఓ అత్యున్నత నిర్ణయక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటును వ్యతిరేకస్తూ శశికళ, దినకరన్ కోర్టుకెక్కారు.
నాలుగేళ్ళ జైలు శిక్ష అనంతరం శశికళ విడుదలై కొన్ని రోజులు బెంగళూరులో వుండి.. ఆ తర్వాత అత్యంత అట్టహాసంగా చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆమె చెన్నైకి వచ్చిన తీరు చూసిన వారందరు ఇక అన్నా డిఎంకే పగ్గాలను లాగేసుకోవడమే చిన్నమ్మ ఆశయం అని అనుకున్నారు. కానీ ఓపీఎస్-ఈపీఎస్ జంట అందుకు అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు మరింత సమన్వయం ప్రదర్శించి.. చిన్నమ్మ వర్గానికి చెక్ పెట్టారు. వ్యూహాత్మకంగా బీజేపీని కూడా వాడుకున్న ఓపీఎస్-ఈపీఎస్ జంట.. చిన్నమ్మ రాజకీయ సన్యాసం తీసుకునేలా చేశారు. పరోక్షంగా బీజేపీ కోటాలో టిక్కెట్లు పొందాలనుకున్న దినకరన్ బ్యాచ్‌కు కూడా ఓపీఎస్-ఈపీఎస్ జంట చెక్ పెట్టింది. ఒక దశలో పన్నీరు సెల్వం అలిగి సమావేశాలకు దూరంగా వున్నా కూడా ముఖ్యమంత్రి ఫళని స్వామి తనదైన శైలిలో ఆయన్ను కలుపుకుని తామిద్దరి మధ్య ఎలాంటి స్పర్థలు లేవని చాటారు.
ఇదిలా వుంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని చిన్నమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి తానేనంటూ దినకరన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ గత మూడేళ్లుగా మద్రాసు హైకోర్టులో కొనసాగింది. ఆ తర్వాత ఈ విచారణను ప్రత్యేక కోర్టుకు మార్చారు. అదే సమయంలో ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో– కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రత్యేక కోర్టులో రిట్ దాఖలు చేశారు. సోమవారం (మార్చి 15న) ఈ పిటిషన్లన్నీ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు రాగా, దినకరన్ తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. దినకరన్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దినకరన్ తరఫున ప్రత్యేక కోర్టులో ఓ లేఖను అందజేశారు.
అందులో తాను (దినకరన్) అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేసినట్టు, ఆ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. ఈ దృష్ట్యా అన్నాడీఎంకే వ్యవహారాలపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు దినకరన్ స్పష్టం చేశారు. తాను స్వయంగా పార్టీ పెట్టుకున్నందున ఇతర పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నించలేనని దినకరన్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మరో పిటిషనర్ కూడా ఉన్నారని, వారి మాటేంటో అని పరోక్షంగా శశికళ విధానం గురించి న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో మరో పిటిషనర్‌గా ఉన్న శశికళ తన నిర్ణయం ఏమిటో ఏప్రిల్ 9వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని పేర్కొంటూ, అదే రోజుకు పిటిషన్ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అయితే, శశికళ రాజకీయ సన్యాసం వెనుక భారీ భవిష్యత్ వ్యూహం వుందని తమిళ రాజకీయ పండితులు అంఛనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందరే జైలు నుంచి వచ్చినందున అప్పటికప్పుడు ఓపీఎస్-ఈపీఎస్‌లకు చెక్ పెట్టి.. పార్టీని తన ఆధీనంలోకి తీసుకోవడం సాధ్యం కానందు వల్లే వేచి చూసే ధోరణితోనే ఆమె రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. దానికి తోడు అన్నా డిఎంకేని బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తే అంతిమంగా అది డీఎంకేకు ప్రయోజనకరంగా మారుతుందని బీజేపీ అధినేత అమిత్ షా చిన్నమ్మను హెచ్చరించడం వల్లనే ఆమె రాజకీయ సన్యాసం తీసుకున్నారని తెలుస్తోంది. తన చెన్నై పర్యటనలో భాగంగా అమిత్ షా.. దినకరన్‌ను పిలిపించుకుని మరీ చిన్నమ్మకు ఈ సందేశాన్ని పంపారని చెప్పుకుంటున్నారు.
అయితే ఇక్కడ శశికళ మరో వ్యూహం ప్రకారం కూడా బీజేపీ సందేశానికి సానుకూలంగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార అన్నా డిఎంకే ఓటమి ఖాయమని చిన్నమ్మ భావించడం వల్లనే రాజకీయ సన్యాసం ప్రకటించారని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓడి.. విపక్షంలోకి చేరితే అప్పుడు ఓపీఎస్-ఈపీఎస్‌లపై ఒత్తిడి తేవడం సులభమవుతుందని చిన్నమ్మ అంఛనా వేస్తున్నారు. ప్రతిపక్షంలో వుంటూ స్టాలిన్ లాంటి దిగ్గజ నేతతో తలపడాలంటే చిన్నమ్మ లాంటి బలమైన నేతనే పార్టీకి సారథిగా రావాల్సి వుంటుందని, అప్పుడు ఓపీఎస్-ఈపీఎస్‌లిద్దరు దారిలోకి వస్తారని చిన్నమ్మ భావించడం వల్లనే తాత్కాలికంగా సన్యాసం తీసుకున్నారని అంటున్నారు. దాదాపు పదేళ్ళపాటు అధికారానికి దూరంగా వుండి అన్నా డిఎంకే చేతిలో అవమానపడ్డ స్టాలిన్ ఒకసారి అధికార పగ్గాలు చేపడితే.. ఓపీఎస్-ఈపీఎస్‌లకు సినిమా చూపించడం ఖాయమని అప్పుడు పార్టీకి తన అవసరం పెరుగుతుందని శశికళ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ: తెలంగాణ సర్కార్‌కు ‘సుప్రీం‘ ఊరట.. నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత