అయ్యే ఇలా అన్నానేంటీ.. అతను మా పార్టీ వాడేగా.. నాలుక్కరుచుకున్న సినీ నటి కుష్బూ..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం మరింత వేడెక్కింది.
cine actress kushboo: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్‌కు కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. చెన్నై లోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్ధి కుష్బూ.
మహిళా ఓటర్లను పేరు పేరన పలుకరించారు కుష్బూ. తనకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. డీఎంకే గెలిస్తే మహిళలకు రక్షణ ఉండదన్నారు. డీఎంకే ఎంపీ రాజాపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించారు కుష్బూ. తనపై కూడా డీఎంకే , కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కుష్బూ. తప్పకుండా తమిళనాడు ఓటర్లే వాళ్లకు బుద్ది చెబుతారని అన్నారు.
ఇదిలావుంటే, కుష్బూ నియోజకవర్గంలో మరో ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. నియోజకవర్గంలో పలు సమస్యలు చోటుచేసుకున్నాయని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు. దీంతో పక్కనున్న ఓ ఖద్దరు చొక్కా నేత కాస్త ఇబ్బందిగా కదిలాడు. ఇవేవీ పట్టించుకోని ఖుష్బూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. అంతా అయ్యాక వెనుక నుంచి ఓ నేత.. ‘మేడం ఆ పాత ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనున్న ఆయనే’ అని చెవుల్లో గుసగుసలాడడంతో ఏం చేయాలో పాలుపోలేదు ఖుష్బూకి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న కార్యకర్తలతా పెద్దపెట్టున నవ్వుతూ కేకలేశారు. దీంతో ఖుష్బూ కూడా కాస్త ఇబ్బందిగా కదలాడారు. డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా వున్న కేకే సెల్వం… ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.