దేశంలో ప్రాంతీయపార్టీ సొంతంగా అధికారంలోకి రావడం తమిళనాడులోనే మొదలు!
ఇప్పుడంటే దేశంలో ప్రాంతీయపార్టీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి కానీ .. అయిదో దశకంలో రెండో మూడో ఉండేవి. అవి కూడా నామమాత్రంగానే! జాతీయపార్టీలతో పోటీపడే స్థాయి ఉండేది కాదు. అసలు ప్రాంతీయపార్టీ...
ఇప్పుడంటే దేశంలో ప్రాంతీయపార్టీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి కానీ .. అయిదో దశకంలో రెండో మూడో ఉండేవి. అవి కూడా నామమాత్రంగానే! జాతీయపార్టీలతో పోటీపడే స్థాయి ఉండేది కాదు. అసలు ప్రాంతీయపార్టీ సొంతంగా ఓ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది తమిళనాడులోనే! 1967 మార్చి 6న తమిళనాడులో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దించేసి డీఎంకే ప్రభుత్వంలోకి వచ్చింది. అణ్నాదురై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజది! అంతకు ముందు జరిగిన రెండు ఎన్నికల్లోనూ డీఎంకే పోటీ చేసింది కానీ అధికారంలోకి రాలేకపోయింది.. 1957లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన డీఎంకే 234 అసెంబ్లీ స్థానాలలో 124 స్థానాలకే పోటీ చేసింది. 39 లోక్‌సభ స్థానాలలో 11 చోట్ల పోటీ చేసింది. కామరాజ్‌పై ఉన్న గౌరవాభిమానాల కారణంగా డీఎంకే ఆయనపై పోటీ పెట్టలేదు.. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకేకు కేవలం 13 అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభించాయి. గెలిచిన ప్రముఖుల్లో అణ్నా, కరుణానిధి, అన్బళగన్, సత్యవాణి ముత్తు, ఆసైతంబి వంటి వారు ఉంటే, ఓడినవారిలో కవి కణ్నదాసన్, నెడుంజెళియన్ ఉన్నారు. డిఎంకే ప్రభావమంతా మద్రాస్ నగరం, ఉత్తర దక్షిణ ఆర్కాట్, సేలం జిల్లాలలోనే కనిపించింది. కాంగ్రెస్‌కు 151 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌తో విభేదించి కాంగ్రెస్ రిఫార్మ్ పార్టీ పెట్టుకున్న రాజగోపాలచారికి 16 స్థానాలు వచ్చాయి. 1962 అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి డీఎంకే బలం కొంచెం పెరిగింది.
మొత్తం 50 స్థానాలను డీఎంకే గెల్చుకుంది. ఆశ్చర్యమేమిటంటే కాంచీపురం నుంచి పోటీ చేసిన అణ్నాదురై ఓడిపోవడం. 1967 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. దేశ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఆదరణ తగ్గినప్పటికీ ఒంటరిగా ఆ పార్టీని ఎదుర్కోవడం కష్టమని తెలుసుకున్నారు అణ్నాదురై. అందుకే ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేశారు. ఓ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమికి రాజగోపాలచారి అండదండలు కూడా లభించాయి. కాంగ్రెస్ రనుంచి బయటకు వచ్చిన రాజాజీకి కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ను ఓడించగల సామర్థ్యం డీఎంకేకే ఉందని తెలుసుకున్న రాజాజీ ఆ పార్టీకి ఓటేయాలంటూ పిలుపిచ్చారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పడిన డీఎంకేకు బ్రాహ్మణులు ఓటేయరని అనుకున్న రాజాజీ ‘డీఎంకేకు ఓటేయడం పాపమేమీ కాదు. నా యజ్ఞోపవీతం పట్టుకుని చెబుతున్నా. మీరంతా డీఎంకేకు ఓటు వేయండి’ అంటూ ప్రచారం చేశారు రాజాజీ. ఎంజీఆర్ ప్రచారం చేయడం వల్లనో ఏమో కానీ ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ఎమ్‌జీఆర్ తొలి విడత ప్రచార సభలు బాగానే జరిగాయి.. ఆ తర్వాత నటుడు ఎమ్.ఆర్. రాధా కారణంగా ఎమ్‌జీఆర్‌కు ఇంకా ఎక్కువ ఇమేజ్ వచ్చింది. పెరియార్‌కు ప్రియ శిష్యుడైన రాధాకు డీఎంకే అధికారంలోకి రావడం ఇష్టం లేదు. అసలు డీఎంకే ఎదుగుదలనే సహించలేకపోయారు. రాజాజీ ఆశీస్సులు, ఎమ్జీఆర్ ప్రచారం కారణంగా డీఎంకే అధికారంలోకి రావడం పక్కా అని తెలిసిపోయింది. ఇక లాభం లేదనుకుని ఎంజీఆర్‌ను చంపడమే బెటరనుకున్నాడు. నేరుగా ఎంజీఆర్ ఇంటికే వెళ్లారు. ఎంజీఆర్‌ను తుపాకీతో అతి దగ్గరగా కాల్చాడు. ఎంజీఆర్ గొంతులోంచి తుపాకీ గుండు వెళ్లింది. అదృష్టవశాత్తూ ఎంజీఆర్ బతికారు. చావుబతుకుల్లో ఉన్న ఎంజీఆర్ ఫోటో సానుభూతి వర్షం కురిపించింది. అదంతా ఓట్ల రూపంలోకి మారింది. మీ ఇంటికి వద్దామనుకున్నాను, ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేను, అందుకే మీ హృదయాల్లో చోటు కోరుతున్నాను” అనే మెసేజ్‌తో ఎంజీఆర్ పోస్టర్లు రాష్ట్రమంతటా వెలిశాయి. మహిళల, యువత ఓట్లు గంపగుత్తగా డీఎంకేకు పడ్డాయి. కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 41.52 శాతం ఓట్లు లభించడం విశేషం. డీఎంకేకు 40.82 శాతం ఓట్లే వచ్చినప్పటికీ 173 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేశాయి కాబట్టే డీఎంకేకు అన్ని సీట్లు వచ్చాయన్నది గమనించాలి. 39 లోక్‌సభ స్థానాలలో డీఎంకేకు పాతిక సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌లోని మహామహులంతా ఓడిపోయారు. సాక్షాత్తూ కామరాజ్ కూడా తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆయనను ఓడించింది 28 ఏళ్ల విద్యార్థి నాయకుడు పి.శ్రీనివాసన్ కావడం గమనార్హం.
అణ్నాదురై ముఖ్యమంత్రిగా రెండేళ్లు కూడా లేరు. కాన్సర్ వ్యాధి ఆయనను ఎంతగానో బాధించింది. 1969 ఫిబ్రవరి 3న అణ్నాదురై కన్నుమూశారు. నికరంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది పదిహేను నెలల కాలమే! ఆయన అంత్యక్రియలకు లక్షలాది జనం వచ్చారు. ఇదో రికార్డు. అణ్నాదురై భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు విరగబడ్డారు.. ఆ తొక్కిసలాటలో అయిదుగురు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.. ఇందులో ఒకరు మరణించారు కూడా! నిజానికి అణ్నాదురై మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి నెడుంజెళియన్‌కు దక్కాలి. అణ్నా విదేశాలకు వెళ్లినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా నెడుంజెళియనే పనిచేశారు. నిజాయితీపరుడు. మేథావి కూడా! కాకని కరుణానిధికి సీఎం పదవి లభించింది. కారణం జిల్లా కార్యదర్శులను మచ్చిక చేసుకోవడమే! సీఎం పదవి కోసం ముందుగానే ప్రణాళికలను రచించుకోవడం! పైగా కరుణానిధి ముఖ్యమంత్రి కావడాఇనికి ఎంజీఆర్ సాయపడ్డారు.
మరిన్ని చదవండి ఇక్కడ :అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉంది ఈ మెగా హీరోతోనేనా..?నిజంకానున్న ‘వార్త’లకు చెక్ : Anu Emmanuel Love with mega brother.
పెద్దపులి వేట అరుదైన దృశ్యాలు! కెమెరాకు చిక్కిన వైల్డ్‌లైఫ్ వీడియో : Tiger Hunting Video.