Kelara Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల బరిలో కార్పొరేట్ సంస్థ.. పార్టీల స్థానంలో ఇక కార్పొరేట్ హౌజెస్?
రాజకీయాల్లోకి కార్పొరేట్లు ఎంటరవడం దశాబ్దాల క్రితమే మొదలైంది. కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ బిజినెస్‌మెన్ రాజకీయ పార్టీల్లోకి చేరి చట్టసభలకు ఎన్నికవుతూనే వున్నారు.
Kerala Elections and Corporate House contesting: రాజకీయాల్లోకి కార్పొరేట్లు ఎంటరవడం దశాబ్దాల క్రితమే మొదలైంది. కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ బిజినెస్‌మెన్ రాజకీయ పార్టీల్లోకి చేరి చట్టసభలకు ఎన్నికవుతూనే వున్నారు. ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ అధిపతి అయినా.. ఎంత పెద్ద బిజినెస్‌మాన్ అయినా.. కూడా చివరికి ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరి, టిక్కెట్ పొంది ఛట్టసభలకు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తమకున్న ధనబలంతో సునాయాసంగా విజయం సాధిస్తుండగా ఎంత ధనం వెచ్చించినా ఓటమి భారాన్ని తప్పించుకోలేని వారు కొందరు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 2004లో జరిగిన ఎన్నికల్లో లాంకో సంస్థ అధిపతి లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి.. విజయవాడ ఎంపీగా లోక్‌సభలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని చేవెళ్ళ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున కొండా విశ్వేశ్వర రెడ్డి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇలాంటి ఉదంతాలు దేశంలో ఎన్నో కనిపిస్తాయి.
ప్రస్తుతం జరుగుతున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ కార్పొరేట్ హౌజ్ స్వయంగా బరిలోకి దిగింది. ఎన్నికల్లో ఒక కార్పోరేట్ సంస్థ పోటీ చేయడం చాలా అరుదు. అందులోను గెలవడం చాలా కష్టం. కానీ కేరళ రాష్ట్రంలో కార్పోరేట్ సంస్థ సభ్యులు పోటీ చేయడమే కాదు.. విజయం సాధిస్తున్నారు. ప్రజల మన్నలను పొందుతున్నారు. ఆ కార్పొరేట్ సంస్థ పేరే ట్వంటీ 20. అన్నా కైటెక్స్ అనే సంస్థకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ‘ట్వంటీ 20’. ఇదిపుడు ఎర్నాకులం జిల్లాలో పోటీ చేస్తోంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీలోకి దిగుతోంది ట్వంటీ 20 సంస్థ. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
గతంలోను ట్వంటీ 20 సంస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లోను పోటీ చేసింది. 2015లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగింది ట్వంటీ20 సంస్థ. కిళక్కంబలం పంచాయతీలో 19 వార్డులకు గాను 17 వార్డుల్లో విజయం సాధించింది. పంచాయితీని దక్కించుకున్న తర్వాత ఇక అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం అన్న విధంగా ప్లాన్ చేసుకున్నారు ట్వంటీ 20 సంస్థ ప్రతినిధులు. అయితే.. కారణాలేంటో గానీ.. 2016లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత గత సంవత్సరం (2020)లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ట్వంటీ 20 సంస్థ పోటీ చేసింది. కిళక్కంబలం పంచాయతీలోని అన్ని స్థానాలతోపాటు కున్నథునాడ్, మళువన్నూర్ పంచాయతీల్లోను విజయం సాధించింది. ప్రజలకు అత్యవసరాలైన నీరు, కూరగాయలు, పప్పులు, ఉప్పు.. తదితరాలను మార్కెట్ ధరలతో పోలిస్తే సగం ధరలకే అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటోంది ట్వంటీ 20 నేతృత్వంలోని స్థానిక ప్రభుత్వాలు.
అన్నా కైటెక్స్ కార్పొరేట్ సంస్థ తొలుత 1968లో అన్నా అల్యుమినియమ్ పేరిట ప్రారంభమైంది. దీనిని స్వర్గీయ ఎం.సీ. జాకోబ్ స్థాపించారు. అన్నా కైటెక్స్ గ్రూప్ సీఎండీ బాబి ఎం. జాకోబ్ వ్యవహరించారు. అల్యూమినియంతో తయారుచేసిన వంట సామాగ్రి అమ్మకాలతో మార్కెట్లోకి ప్రవేశించింది అన్నా కైటెక్స్ సంస్థ. 1975లో ‘సరస్’ మసాల ఉత్పత్తులతో మార్కెట్ లోకి వచ్చింది ట్వంటీ 20. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ తదితర ఆహార ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోయింది అన్నా కైటెక్స్. 1979లో కైటెక్స్ బ్రాండ్ పేర గార్మెంట్స్ తయారీ రంగంలోకి దిగింది. 2013లో సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ట్వంటీ 20ని ఏర్పాటు చేసింది. కైటెక్స్ గార్మెంట్స్ నియంత్రణలో పనిచేస్తోంది ట్వంటీ 20. అన్నా కైటెక్స్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12 వేల 500. వీరిలో అత్యధికం కిళక్కంబలం పంచాయతీ పరిధిలో నివసిస్తున్నవారే కావడంతో ఆ పంచాయితీని దక్కించుకోవడం ట్వంటీ 20కి సులభ సాధ్యమైంది.
ALSO READ: ఏకగ్రీవాలకు ఇక డిక్లరేషన్లు.. హైకోర్టు తీర్పుతో కదిలిన ఎన్నికల కమిషన్
ALSO READ: తెలంగాణ సర్కార్‌కు ‘సుప్రీం‘ ఊరట.. నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
ALSO READ: ప్రత్యేక కోర్టులో దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ వ్యూహంపై ఇపుడు ఉత్కంఠ