Goa Elections 2022: గోవాలో మరో రాజకీయ సంక్షోభం..! స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు

Goa Sting Operation: గోవాలో సోమవారం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 78.94 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పోటీచేస్తున్న ఈ ఎన్నికల్లో

Goa Elections 2022: గోవాలో మరో రాజకీయ సంక్షోభం..! స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు
Goa
Follow us

|

Updated on: Feb 15, 2022 | 6:52 PM

Goa Sting Operation: గోవాలో సోమవారం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 78.94 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పోటీచేస్తున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేకపోవడం మంచి పరిణామం. (goa assembly polls) ఈవీఎంలలో 301 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్లిప్తం అయింది. అయితే.. మార్చి 10న ఈ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. COVID-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఓటర్లకు పోలింగ్ స్టేషన్‌ల వద్ద గ్లౌజులు, మాస్కులను సైతం పంపిణీ చేశారు. అయితే..దాదాపు 80 శాతానికి చేరువలో పోలింగ్ నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఉత్తర గోవాలోని సంఖలిమ్ నియోజకవర్గంలో అత్యధికంగా 89.61 శాతం ఓటింగ్ నమోదైందని, దక్షిణ గోవాలోని బెనౌలిమ్‌లో అత్యల్పంగా 70.20 శాతం ఓటింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కునాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంఖలిమ్ నుంచి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా 82.56 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కాస్త తగ్గింది. అయితే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అదే నిజమైతే గోవాలో మరోసారి రాజకీయ సంక్షోభానికి తెరలేస్తుందని.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలు జోరుగా కొనసాగుతాయన్న ప్రశ్నలు అందరి నుంచి వ్యక్తమవుతున్నాయని వ్యాసకర్త అజయ్ ఝా పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. రాజకీయం మరింత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2017లో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కంటే పేలవంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 40 మంది సభ్యుల సభలో బీజేపీ (BJP) 13 మంది ఎమ్మెల్యేలను గెలవగా.. అత్యధికంగా 17 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ (Congress) ను బీజేపీ అధిగమించింది. తరువాతి రెండేళ్లలో.. బిజెపి తన సంఖ్యను పెంచుకోవడానికి, మెజారిటీని పొందేందుకు మరో 13 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను లాగేసుకుంది. ఈ క్రమంలో తాజగా జరిగిన ఈ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 12న ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రత్యర్థి శ్రేణుల నుంచి నలుగురు కాబోయే విజేతలు ప్రభుత్వ ఏర్పాటులో తమ మద్దతు అవసరమైతే.. వ్యక్తిగత లాభంతో బీజేపీకి మద్దతు ఇవ్వాలని, అవసరమైతే పార్టీ మారడానికి కూడా ఆసక్తిగా ఉన్నట్లు స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. వీరిలో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్ అలెమావో, బెనౌలిమ్ నుంచి పోటి చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మోర్ముగావ్ స్థానంలో పోటీ చేస్తున్న గోవా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంకల్ప్ అమోన్కర్, మరో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు – నవేలిమ్ నుంచి ఫుర్టాడో అవెర్టానో, వెలిమి నియోజకవర్గం నుంచి సావియో డిసిల్వా ఉన్నారు.

ఈ పరిణామంతో కంగుతిన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశాయి. అయితే ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అతుల్ అగర్వాల్ చూపిన ఫుటేజ్ అసలైనదని, తమ రిపోర్టర్ విశాల్ శేఖర్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారని వెల్లడించారు. అవసరమైతే ఒరిజినల్ ఫుటేజీని కూడా ఎన్నికల కమిషన్‌కు అందజేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్ లేదా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయడం బిజెపికి ఓటు వేసినట్లేనని గోవాలో ప్రచారం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చేసిన ప్రకటన.. దీనికి మరింత బలం చేకూరేలా ఉంది.. ఆ పార్టీల నుంచి గెలిచిన వారు అమ్ముడుపోతారంటూ ఆయన పేర్కొ్న్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ ఆడే ఆటలో వారంతా పావులుగా మారుతారని తెలిపారు.

అయితే.. స్టింగ్ ఆపరేషన్ ప్రసారమైన వెంటనే, ఢిల్లీ అధికార పార్టీ తన ప్రత్యర్థులను అప్రతిష్టపాలు చేసేందుకు గోవాలో ఆడుతున్న డర్టీ ట్రిక్ అని ఆప్ సీనియర్ నాయకుడు రాఘవ్ చద్దా ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. ఆప్ 2017లో తన తొలి ప్రయత్నంలో గోవాలో పరాజయం పాలైన తర్వాత.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ పార్టీగా అవతరించేందుకు.. గోవాలో అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రాష్ట్రంలోని 39 స్థానాల్లో పోటీ చేస్తోంది. రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించేలా బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు సిద్ధమైంది. 37 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్.. మిత్రపక్షమైన గోవా ఫార్వర్డ్ పార్టీకి మూడు స్థానాలను కేటాయించింది. తృణమూల్ కాంగ్రెస్ 26 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, దాని మిత్రపక్షం మహారాష్ట్రవాదీ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొత్తం 68 మంది స్వతంత్ర అభ్యర్థులు సహా 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్రులలో ఇద్దరు బలీయమైన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ సైతం ఉన్నారు.

అయితే.. పార్టీలు మహిళా అభ్యర్థులను అంతగా నిలబెట్టలేదు. మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ ఇద్దరు మహిళా అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఆప్ ముగ్గురు, తృణమూల్ కాంగ్రెస్ గరిష్టంగా నలుగురు, కాంగ్రెస్ ఇద్దరు, శివసేన ఇద్దరు మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎన్సీపీ, ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే.. గోవా ఫలితాల్లో హంగ్ ఏర్పడితే.. నాటకాల మధ్య గోవాలో అసెంబ్లీని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని ప్రలోభాలతో, పొత్తులతో రాజకీయం హాట్ టాపిక్ కానుంది. ఎందుకంటే.. ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గోవాలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలంటే.. మార్చి 10 వరకు వేచి ఉండక తప్పదని అజయ్ ఝా పేర్కొన్నారు.

Also Read:

Sanjay Raut: ఆ విషయంలో కూడా ఈడీ ఇలానే దర్యాప్తు చేస్తుందా.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు.. 

CM KCR: మతతత్వ శక్తులపై పోరాటం కొనసాగించాల్సిందే.. సీఎం కేసీఆర్‌ను అభినందించిన మాజీ ప్రధాని దేవెగౌడ..

Latest Articles