AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections 2021: మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా.. అన్నీ ఓకే గానీ.. బెంగాల్‌పైనే స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?

అందరికీ షాకిస్తూ వారం ముందుగానే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి మొదటి వారంలో షెడ్యూలు వస్తుందని అనుకుంటున్న వారు సీఈసీ ప్రకటనతో కాస్త షాకయ్యారు. అయితే.. బెంగాల్ విషయంలో మాత్రం ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Elections 2021: మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా.. అన్నీ ఓకే గానీ.. బెంగాల్‌పైనే స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 26, 2021 | 7:22 PM

Share

Election commission release polling schedule: నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. నిజానికి మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుందని ఆశించిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వారం ముందుగానే ఎన్నికల అనౌన్స్ చేసి రాజకీయ పార్టీలకు మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో వున్న అధినేతలకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. మొత్తానికి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చింది. మార్చి 2వ తేదీన తొలి నోటిఫికేషన్ విడుదలవబోతోంది. మే 2న ఓట్ల లెక్కింపుతో ఈ ఎన్నికల ప్రహసనం ముగియబోతోంది.

బెంగాల్ అసెంబ్లీలోని 294 సీట్లకు గాను సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది. దానికి కారణం అక్కడి ప్రత్యేక పరిస్థితులేనని చెప్పుకొచ్చారు సీఈసీ సునీల్ ఆరోరా. మరో రెండు నెలల్లో రిటైర్ కాబోతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించి కొంత భావోద్వేగాన్ని ప్రదర్శించారు. తమిళనాడు అసెంబ్లీలోని 234 సీట్లకు, కేరళ అసెంబ్లీలోని 140 సీట్లకు, పుదుచ్ఛేరి అసెంబ్లీ (కేంద్ర పాలిత ప్రాంతం)లోని 30 సీట్లకు ఓకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది. ఇక ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతోంది సీఈసీ. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాలలో ఖాళీ అయిన 34 అసెంబ్లీ సీట్లు, నాలుగు పార్లమెంటు సీట్లకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వీటిలో తమిళనాడులో ఖాళీ అయిన ఎపీ సీటు కన్యాకుమారికి, కేరళలో ఖాళీ అయిన ఎపీ సీటు మలప్పురానికి ఏప్రిల్ ఆరో తేదీన ఉప ఎన్నిక జరుగనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్నాటకలోని బెల్గామ్ లోక్‌సభ స్థానాలకు ఇపుడే ఎన్నికలు నిర్వహించబోతున్నా వాటి షెడ్యూలును ప్రత్యేకంగా విడుదల చేస్తామని సీఈసీ తెలిపారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో వస్తున్న ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకం కాబోతున్నాయి. దేశంలోని మొత్తం ఓటర్లలో సుమారు 15 శాతం మంది ఈ అసెంబ్లీల ఎన్నికల్లో తమ తీర్పును వెలువరించబోతున్నారు. మొత్తం 824 అసెంబ్లీ సీట్లలో 18 కోట్ల 68 లక్షల మంది ఓటర్లు తమ తీర్పునివ్వబోతున్నారు.

అస్సాంలో మూడు విడతలు

ఈశాన్య భారతంలోని పెద్ద రాష్ట్రమైన అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా… అక్కడ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మొదటి విడతకు మార్చి రెండో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. పోలింగ్ మార్చి 27వ తేదీన నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ ఒకటిన, మూడో విడత పోలింగ్ ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతాయి. కౌంటింగ్ మే రెండో తేదీన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరిలకు ఓకే విడత

140 అసెంబ్లీ స్థానాలున్న కేరళకు, 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడుకు, 30 సీట్లున్న పుదుచ్ఛేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఓకే విడతలో పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ ఆరో తేదీన ఈ రెండు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ నిర్వహిస్తారు. మే రెండో తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

బెంగాల్ సుదీర్ఘ ప్రహసనం

ఎన్నికల సందర్భంతోపాటు రాజకీయ ప్రదర్శనలు, ర్యాలీ సందర్భాలలో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే బెంగాల్ పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అక్కడ సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం తలపెట్టింది. మార్చి 27వ తేదీన తొలివిడత జరగనుండగా.. ఆఖరుగా ఎనిమిదో విడత ఏప్రిల్ 29వ తేదీన జరగబోతోంది. ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26 తేదీలలో రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడో విడత పోలింగ్ జరుగుతుంది.

కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాలతోపాటు.. పుదుచ్ఛేరి యూటీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు కారణాలతో ఖాళీ అయిన శాసనసభ, లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4 లోక్‌సభ స్థానాలు, వివిధ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఖాళీగా ఉన్న లోక్‌సభ స్థానాలు కన్యాకుమారి (తమిళనాడు), తిరుపతి (ఏపీ), బెల్గాం (కర్నాటక), మలప్పురం (కేరళ) కాగా.. వీటిలో కన్యాకుమారి, మలప్పురంలకు ఏప్రిల్ ఆరో తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో చెరో 3 అసెంబ్లీ సీట్లతో పాటు తెలంగాణ, ఒడిశా, నాగాలాండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, మహారాష్ట్ర, హరియాణా, మేఘాలయ, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ సీటుకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఉపఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

ALSO READ: దేవభూమిలో ఆది నుంచి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులే.. కమల వికాసానికి ఛాన్సేది?

ALSO READ: గవర్నర్‌కు అవమానం.. దత్తన్నపై దాడికి కాంగ్రెస్ సభ్యుల యత్నం..