పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమిదే విజయం.. వంశ రాజకీయాలతో కాంగ్రెస్ పతనం: అమిత్ షా

Amit Shah - Puducherry: పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తచేశారు. వంశ రాజకీయాల కారణంగా..

  • Shaik Madarsaheb
  • Publish Date - 3:31 pm, Sun, 28 February 21
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమిదే విజయం.. వంశ రాజకీయాలతో కాంగ్రెస్ పతనం: అమిత్ షా

Amit Shah – Puducherry: పుదుచ్చేరిలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తచేశారు. వంశ రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ పుదుచ్చేరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా విచ్ఛిన్నమవుతోందని షా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం పుదుచ్చేరిలోని కరైకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో అమిత్ షా మాట్లాడారు. పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో 75శాతం నిరుద్యోగ యువత ఉందని షా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత 40శాతానికి తగ్గుతుందని వెల్లడించారు.

కొన్నిరోజుల కిందట ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కేంద్రంలో మత్స్య శాఖ ఉందన్న విషయం కూడా గుర్తులేదని విమర్శించారు. కేంద్రంలో ఆ శాఖ రెండేళ్ల కిందటి నుంచే ఉందన్న విషయం కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా.. దేశాన్ని పాలించే వ్యక్తులు కావాలా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా బీజేపీలో చేరుతున్నారని.. ఆపార్టీలో పురోగతి లేదు కాబట్టే వారు చేరుతున్నారని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి పేద కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటి కుళాయి సౌకర్యాన్ని కల్పిస్తామని అమిత్ షా హామీనిచ్చారు. పుదుచ్చేరి అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వెల్లడించారు.

పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా ఉడాన్‌ పథకంలో భాగంగా పుదుచ్చేరి, బెంగళూరు, హైదరాబాద్‌ను అనుసంధానం చేసిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని.. తెలిపారు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు 14 ఏళ్ల తరబడి స్థానిక ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందంటూ అమిత్‌షా ఆపార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పుదుచ్చేరి ప్రాంతం చాలా పవిత్రమైందని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి చాలా కాలం ఇక్కడ నివసరించారన్నారు. అలాగే శ్రీ అరబిందో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో పుదుచ్చేరికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.

Also Read:

Mann Ki Baat: ఆత్మనిర్భర్ భారత్ అనేది ప్రభుత్వ పథకం కాదు.. జాతీయ స్ఫూర్తి: ప్రధాని మోదీ