Kerala Assembly elections 2021: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమికే విజయావకాశాలు, బీజేపీ హిందుత్వ ఎజెండా ప్రభావం ఎంత ఉంది?

Kerala elections: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్‌ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి..

Kerala Assembly elections 2021: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమికే విజయావకాశాలు, బీజేపీ హిందుత్వ ఎజెండా ప్రభావం ఎంత ఉంది?
Follow us
Balu

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 28, 2021 | 5:48 PM

Kerala Assembly Elections 2021: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్‌ ఆరున ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మే రెండున ఫలితాలు రాబోతున్నాయి.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని వదిలేస్తే ఎన్నికలు జరగబోతున్న మిగతా నాలుగు రాష్ట్రాల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. బెంగాల్‌లో బీజేపీ అనుకున్నది సాధించగలుగుతుందా? అసోంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది? తమిళనాడులో డీఎంకే విజయం నల్లేరుపై నడక కానుందా? కేరళలో ఎల్‌డీఎఫ్‌ అధికారంలో నిలుపుకోగలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని వెంటాడుతున్నాయి. కేరళ విషయానికి వస్తే ఎల్‌డీఎఫ్‌కు కాసింత మొగ్గు కనిపిస్తోంది. అయితే ఆ మొగ్గు అధికారంలోకి వచ్చేలా చేస్తుందా లేదా అన్నదే సంశయం. తమిళనాడులాగే కేరళలో కూడా ఏ కూటమి కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు.. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఓసారి లెఫ్ట్‌ కూటమి ఎల్‌డీఎఫ్‌ విజయం సాధిస్తే మరోసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ గెలుస్తూ వస్తున్నాయి. మొన్నీమధ్యన జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎల్‌డీఎఫ్‌ ఘన విజయం సాధించింది.. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయా అంటే చెప్పడం కష్టమే! ఎందుకంటే ఓటరు మనసు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు.. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.. ఆ ఎన్నికల వేళ యూడీఎఫ్‌ అధికారంలో ఉంది.. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది.. అంటే ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కే ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయా? ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నది? ఎల్‌డీఎఫ్‌ కనుక పరాజయం చెందితే మాత్రం అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా కమ్యూనిస్టులు కోల్పోయినట్టే అవుతుంది. కేరళలో ఫలితాలను ప్రభావితం చేసే పది అంశాలలో మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ గెలిచిన అంశమూ ఉంది..

2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాలలో ఎల్‌డీఎఫ్‌ 91 సీట్లను గెల్చుకుని సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్‌కు 47 స్థానాలు లభించగా, ఎన్డీయేకు ఓ సీటు దక్కింది. మరోస్థానం ఇండిపెండెంట్ వశమయ్యింది. అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 941 గ్రామ పంచాయితీలలో లెఫ్ట్ కూటమి 549 స్థానాలను గెల్చుకుంది. యూడీఎఫ్‌ 365 గ్రామ పంచాయితీలను దక్కించుకుంది. ఇక 152 బ్లాక్‌ పంచాయితీలలో వామపక్షాల కూటమి 90 పంచాయితీలను గెల్చుకుంది. అంటే లాస్ట్‌ టైమ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ఇలాంటి ఫలితాలే పునరావృతమయ్యాయి. కేరళలలో ఎంతగా చొచ్చుకుపోదామని ప్రయత్నిస్తున్నా బీజేపీకి సాధ్యం కావడం లేదు. శబరిమలలో మహిళల ప్రవేశం వివాదాన్ని బీజేపీ బాగానే వాడుకుంది కానీ ఎన్నికల్లో అదేం పెద్దగా పని చేయలేదు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది.. ఉత్తరభారతమంతా నరేంద్రమోదీ హవా పని చేసినా కేరళలో మాత్రం ఆ గాలి వీయలేదు. అలాగని దక్షిణ భారతంలో బీజేపీ ప్రభావం శూన్యమని చెప్పడానికి లేదు.. ఎందుకంటే కర్నాటకలో పాతిక సీట్లను గెల్చుకుంది. తెలంగాణలో నాలుగు స్థానాలను దక్కించుకుంది.. ఖాతా తెరవనిదల్లా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనే! 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలలో యూడీఎఫ్‌ కూటమికి 19 స్థానాలు లభించాయి. ఎల్‌డీఎఫ్‌ కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక లెఫ్ట్‌ కూటమి పని అయిపోయిందనీ, అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్‌ గెలవడం ఖాయమని అనుకున్నారంతా! కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ గణనీయంగా పుంజుకోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి పెరిగింది. 2015 లోకల్‌ బాడీ ఎన్నికల్లో 14 జిల్లా పంచాయితీలకుగాను ఎల్‌డీఎఫ్‌ సగానికి సగం గెల్చుకుంది. ఈసారి ఆ సంఖ్యను పదకొండుకు పెంచుకుంది. ఆరు నగర కార్పొరేషన్‌లలో ఆరింటికి ఆరు ఎల్‌డీఎఫ్‌ గెల్చుకుంది. త్రిస్సూరు కార్పొరేషన్‌లో ఎల్‌డీఎఫ్‌కు మెజారిటీ రాకపోయినా ఇండిపెండెట్ల సాయంతో అక్కడా అధికారంలోకి వచ్చింది.. 86 మునిసిపాలిటీలలో 40 మునిసిపాలిటీలను గెల్చుకుంది. 152 బ్లాక్‌ పంచాయితీలను క్లీన్‌స్వీప్‌ చేసిన ఎల్‌డీఎఫ్‌ 941 గ్రామ పంచాయితీలలో 514 పంచాయితీలను గెల్చుకుంది.

ఓట్ల శాతం విషయానికి వస్తే ఎల్‌డీఎఫ్‌కు 41.6 శాతం, యూడీఎఫ్‌కు 37.1 శాతం, ఎన్డీయేకు 14.5 శాతం ఓట్లు వచ్చాయి. యూడీఎఫ్‌కు చాలా చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రమేశ్‌ చెన్నితల, ఊమెన్‌ చాండీల సొంత ఇలాఖాల్లో సైతం కాంగ్రెస్‌ ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో సోలార్‌ స్కామ్‌ కేసు యూడీఎఫ్‌పై మాయని మచ్చ తెచ్చింది.. కుంభకోణానికి కారకురాలైన సరితా నాయర్‌ ఊమెన్‌ చాందీకి కూడా మరక అంటించింది.. ఈ ఇన్సిడెంట్‌ జరిగిన తర్వాత యూడీఎఫ్‌ను ప్రజలు నిరాకరించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకున్నారు. కాకపోతే గోల్డ్ స్కామ్‌ను జనం పెద్దగా పట్టించుకోలేదు. రెండు సార్లు వచ్చిన భారీ వరదల సమయంలో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించి ప్రజల మెప్పు సంపాదించింది. అలాగే కోవిడ్‌ను కంట్రోల్‌ చేయడంలో కూడా పినరయ్‌ విజయన్‌ ప్రభుత్వం విజయం సాధించింది.. విజయన్‌ ప్రిన్సిపల్‌ సెకట్రరీ శివశంకర్‌ గోల్డ్‌ స్కామ్‌లో ఇరుక్కున్నారు. ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్‌తో శివశంకర్‌కు సంబంధాలున్నాయన్న విషయమూ బయటకు రావడంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది.. అయితే ఈ స్కామ్‌లో విజయన్‌ పాత్ర లేకపోయినప్పటికీ అవినీతికి ఆస్కారం ఇచ్చారనే అపనింద ఆయనపై పడింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే స్కామ్‌లో విజయన్‌కు పాత్ర లేదని ప్రజలు భావించినట్టు అర్థమవుతుంది. మరోవైపు యూడీఎఫ్‌లోని అంతర్గత గొడవలు కూడా ఎల్‌డీఎఫ్‌ను గెలిపించాయి. యూడీఎఫ్‌ అంటేనే కాంగ్రెస్‌! అంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఆ కూటమిలో చాలా కాంగ్రెస్‌లున్నాయి.. అందులో ప్రధానమైనది కేరళ కాంగ్రెస్‌! 1964లో క్రైస్తవుల అండదండలతో పుట్టిందీ పార్టీ! అప్పట్నుంచి ఇప్పటి వరకు అనేక పార్టీలుగా చీలింది.. అలా చీలిన వాటిల్లో కొన్ని నామరూపాలు లేకుండా పోయాయి.. ఇప్పుడున్నది కేరళ కాంగ్రెస్‌ (ఎమ్‌). ఈ పార్టీ అధినేత కె.ఎం.మాని.. లాస్టియర్‌ ఆయన చనిపోవడంతో పార్టీ బాధ్యతలను ఆయన కుమారుడు జోస్‌ నెత్తికెత్తుకున్నారు. అయితే ఈయన పోకడలు పార్టీలో ఉన్న సీనియర్లకు రుచించలేదు. భరించి సర్దుకుపోయినవారు ఉన్నారు.. ఆ ఉక్కపోతకు భరించలేని వారు బయటకువెళ్లారు. అలా జోసెఫ్‌, థామస్‌లనే ఇద్దరు సీనియర్లు పార్టీని విడిచిపెట్టి కేరళ కాంగ్రెస్‌ (జె) అనే కొత్త పార్టీ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే జోస్‌ పార్టీని కూటమిలోంచి తప్పించింది యూడీఎఫ్‌. వెంటనే కేరళ కాంగ్రెస్‌ (ఎమ్‌)ను ఎల్‌డీఎఫ్‌ అక్కున చేర్చుకుంది. దీంతో పాటు యూడీఎఫ్‌లోనే ఉన్న మరో పార్టీ లోకతాంత్రిక్‌ జనతాదళ్‌ కూడా ఎల్‌డీఎఫ్‌ కూటమిలోకి వెళ్లింది. దీనివల్ల ఎల్‌డీఎఫ్‌ బలం పెరిగింది.. యూడీఎఫ్‌ బలహీనపడింది. ఇందుకు కోటయం, పత్తనమ్‌తిట్ట, ఇడుక్కి జిల్లాలలో వచ్చిన ఫలితాలే నిదర్శనం. ఇంతకు ముందు అక్కడ యూడీఎఫ్‌ బలంగా ఉండేది.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయంటే అది ఉత్తర కేరళలోనే! అందుకు కారణం అక్కడ ముస్లింలీగు బలంగా ఉండటమే! కేరళలో బీజేపీ బలం పెరుగుతుందా అన్న ప్రశ్నకు ఇదమిత్థంగా అవునని చెప్పలేని పరిస్థితి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 15.2 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు మరో అయిదు చిన్నా చితక పార్టీలున్నాయి.. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతం 14.6 శాతానికి పడిపోయింది.. కేరళలలో హిందూ జనాభా 55 శాతంపైనే ఉంటుంది.. ఆ లెక్కన దాదాపు పాతికశాతం హిందువులు బీజేపీ వెంట ఉన్నారని అర్థమవుతోంది. అయితే 2015లో జరిగిన స్థానిక ఎన్నికలతో పోలిస్తే మాత్రం బీజేపీకి ఈ సారి సీట్లు పెరిగాయని చెప్పుకోవచ్చు. గ్రామపంచాయితీలలో పోయినసారి 14 సీట్లు వస్తే.. ఈసారి 23 వచ్చాయి. పాలక్కాడ్‌ జిల్లాలో మొదటి నుంచి బీజేపీకి అంతో ఇంతో బలముంది.. ఇక శబరిమల ఉద్యమం తీవ్రంగా జరిగిన పందళంలో ఈసారి బీజేపీ కొద్దిగా బలం సంపాదించుకోగలిగింది. అయిదేళ్ల పాలనలో ఒక్క గోల్డ్‌ స్కామ్‌ తప్ప ఎల్‌డీఎఫ్‌కు అంటిన మరకలేమీ లేవు.. అయినప్పటికీ ఎల్‌డీఎఫ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించింది. విజయన్‌ పాలన పట్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారనే భావించాలి. లోకల్‌బాడీ ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమైతే మాత్రం ఎల్‌డీఎఫ్‌కు మంచి విజయమే దక్కుతుంది. ఇప్పుడొచ్చిన ఫలితాలను బట్టి 140 అసెంబ్లీ స్థానాలలో 110 స్థానాల్లో ఎల్‌డీఎఫ్‌ ముందంజలో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి ఇవే ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు.

ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కూటముల గెలుపోటములను ఓ పది అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి. మొదటికి కోవిడ్‌ను ప్రభుత్వం ఎలా హ్యాండిల్‌ చేసిందన్న అంశం.. ఈ విషయంలో ప్రభుత్వం బహు ప్రశంసలు అందుకుంది. వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పుడే అప్రమత్తమయ్యింది.. అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి శైలజను అందరూ మెచ్చుకున్నారు.. ఓనం పండుగ తర్వాత ఒక్కసారిగా పెరిగిన కోవిడ్‌ వ్యాప్తిని సమర్థంగా తగ్గించగలిగింది ప్రభుత్వం. రెండో అంశం సంక్షేమ కార్యక్రమాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజల దగ్గరకు వెళ్లగలిగింది. లాక్‌డౌన్‌ సమయంలో అయితే ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకుంది. వలసకూలీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. పెన్షన్‌ను 1600 రూపాయలకు పెంచింది. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంచింది. కరెంట్‌ కోతలు లేకుండా చేసింది.. అలాగే సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూడో అంశం …స్థానిక సంస్థల విజయం ఎల్‌డీఎఫ్‌లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఇదే ఒరవడి అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగితే ఎల్‌డీఎఫ్‌ ఘన విజయం సాధించడం ఖాయం. నాలుగో అంశం కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డ్‌ (కేఐఐఎఫ్‌బీ)పై వస్తున్న విమర్శలు. అయిదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలు చేపడతామని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం వాగ్దానం చేసింది. అయితే ఇప్పటి వరకు 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈ విషయంపైనే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వాదన మాత్రం మరో విధంగా ఉంది. నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మాణం, మరమత్తులు, నూతన రహదారుల నిర్మాణం, బ్రిడ్జ్‌లు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.. కేఐఐఎఫ్‌బీ నిధుల నుంచే వీటి నిర్మాణం జరిగిందని వివరణ ఇచ్చుకుంటోంది.. అయితే ఈ విషయాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకుంటారన్న నమ్మకం అయితే లేదు. ఇక అయిదో అంశం గోల్డ్‌ స్మగ్లింగ్‌.. నిజానికి ఇదో పెద్ద కుంభకోణమే కానీ ఇందులో ముఖ్యమంత్రి విజయన్‌ ఉన్నారని ప్రజలు అనుకోవడం లేదు.. కుంభకోణం జరిగిన మాట వాస్తవమే కానీ ప్రభుత్వం చక్కగా హ్యాండిల్‌ చేసిందని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు.

మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గోల్డ్‌ స్కామ్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆరో అంశమేమిటంటే పార్టీ ఫిరాయింపులు. వామపక్షాలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే బాగోలేదని విశ్లేషకులు అంటున్నారు.. కేరళ కాంగ్రెస్‌ (ఎమ్‌)కు చెందిన జోస్‌ కె. మణిని ఎల్‌డీఎఫ్‌ కూటమిలో చేర్చుకుంటే, మణి సి కప్పన్‌, ఆయన మద్దతు దారులు ఎల్‌డీఎఫ్‌ను వదిలి యూడీఫ్‌ కూటమిలో చేరారు. కప్పన్‌ రాకతో తమ బలం పెరిగిందని యూడీఎఫ్‌ అనుకుంటోంది. ఏడో అంశం శబరిమల వివాదం. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రెండేళ్ల కిందట పెద్ద రచ్చే జరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్‌ ఘన విజయం సాధించడం వెనుక శబరిమల ఇష్యూనే ఉంది.. ఇది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావించిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం శబరిమల ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. అలాగే సీఏఏ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వారిపై కూడా కేసులు ఎత్తివేసింది. దీనివల్ల మైనారిటీ ఓట్లు తమకే పడతాయని ఎల్‌డీఎఫ్‌ భావిస్తుంది.. శబరిమల ఇష్యూలో సానుకూలంగా స్పందించాము కాబట్టి హిందూ ఓటర్లు కూడా తమవైపు నిలుస్తారని అనుకుంటోంది.

ఎనిమిదో అంశం నిరుద్యోగం. పీఎస్‌సీ ర్యాంక్‌ సాధించిన వారు గత నెల రోజులుగా తమ ఆందోళనలను తీవ్రతరం చేశారు. సెక్రటేరియట్‌ ముట్టడి కూడా చేశారు. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల్‌ షెడ్యూల్‌ వచ్చిన వెంటనే నిరుద్యోగులతో చర్చలకు సిద్ధమయ్యింది. ఇక పార్టీ సానుభూతిపరులుగా ఉన్న తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్‌ చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది.. అన్నింటికంటే కీలకమైనది మతం, వర్గం.. ఈ ఎన్నికల్లో బీజేపీ మతాన్ని వాడుకోవాలని చూస్తోంది.. ఎల్‌డీఎఫ్‌ కానీ, యూడీఎఫ్‌ కానీ ఆ జోలికి వెళ్లడం లేదు. ఇక అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఎల్‌డీఎఫ్‌ ఎన్నికల్లో ఏ మేరకు లబ్ధి పొందుతుందో చూడాలి. చిట్టచివరి అంశమైనప్పటికీ మొదటగా చెప్పుకోవలసిన అంశం ఇదే.. అదే ముఖ్యమంత్రి విజయన్‌ పరిపాలనా సామర్థ్యం. ఈ ఎన్నికలు ఆయన పనితీరుకు ఓ నిదర్శనంగా నిలిచే అవకాశం ఉంది. విజయన్‌లోని రాజీపడని మనస్తత్వం కొందరికి బాగా నచ్చింది. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లో కేరళ ప్రజలు ఏ వైపున ఉంటారన్నది చూడాలి.

Also Read:

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు