Selfie Suicide Attempt: ఒంగోలులో సెల్ఫీ సూసైడ్ కలకలం.. ప్రేమ పేరుతో మోసం చేసేవారిని శిక్షించాలంటూ ఆత్మహత్యాయత్నం

ప్రేమించి మోసం చేసిన వాళ్లు అమ్మాయి అయినా... అబ్బాయి అయినా... సరైన శిక్ష విధించాలని కోరుతూ ప్రేమ విఫలమైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Selfie Suicide Attempt: ఒంగోలులో సెల్ఫీ సూసైడ్ కలకలం.. ప్రేమ పేరుతో మోసం చేసేవారిని శిక్షించాలంటూ ఆత్మహత్యాయత్నం
Young Man Selfie Suicide Attempt In Ongole
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 09, 2021 | 9:03 AM

Young Man Selfie Suicide Attempt:  ప్రేమించి మోసం చేసిన వాళ్లు అమ్మాయి అయినా… అబ్బాయి అయినా… సరైన శిక్ష విధించాలని కోరుతూ ప్రేమ విఫలమైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమలో మోసపోయిన వాళ్లు యువకులైతే ఒక న్యాయం.. యువతి అయితే ఒక న్యాయం ఉంటుందా..? అమ్మాయి జీవితం నాశనమవుతుందంటూ మాటలు చెబుతూ ఆమె కే సపోర్ట్ చేస్తారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.. తన మరణంతోనైనా ప్రేమలో మోసం చేసే యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పురుగుల మందు తాగేశాడు. ఈ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆ యువకుడి స్నేహితులు ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువకుడిని గుర్తించి రక్షించారు.

నేను ప్రేమలో విఫలమయ్యా.. ఇక బతికి సాధించేదేమీ లేదు. జీవితంపై విరక్తి పుడుతోంది. అందుకే చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. తాను పురుగుమందు తాగుతున్న వీడియోను షేర్ చేశాడు. నెల్లూరులో ఉండే అతని మిత్రుడు ఒకరు దానిని చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించి, ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన యువకుడు నాగభూషణం ఒంగోలులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఆ యువతి మాట్లాడకపోవడంతో అతను కుంగిపోయాడు. ఈ విషయం స్వగ్రామంలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సైతం తెలిసింది. తమ కుమారుడు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడని భావించిన తల్లిదండ్రులు ఇద్దరు యువకులను అతడికి కాపలాగా ఉంచారు. వారిద్దరి కళ్లుగప్పి యువకుడు గురువారం తన గది నుంచి వెళ్లిపోయాడు.

కాసేపట్లోనే తన ఫేస్‌బుక్‌ లో వీడియో సహా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోస్టింగ్‌ పెట్టాడు. నెల్లూరులో ఉంటున్న స్నేహితుడు ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా సీఐ శ్రీనివాసరెడ్డి ట్రాకింగ్‌ చేశారు. నగర శివార్లలో బైపాస్‌ వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. అప్పటికే అతను పురుగుమందు తాగడంతో వెంటనే అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందగానే స్పందించి తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన పోలీసులకు యువకుడి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read Also..  కిమ్ వికృత చేష్టలకు ఆ రూమ్ అడ్డా.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువు.. సంగతి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!