ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలి
ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రమాదాల బారినపడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కొందరు తమ ఆస్తులను కూడా కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ గేమ్‌కు బలైపోయాడు.

ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రమాదాల బారినపడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కొందరు తమ ఆస్తులను కూడా కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా తమిళనాడులో ఓ 20 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ గేమ్‌కు బలైపోయాడు.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై టీపీ సత్రానికి చెందిన 20 ఏళ్ల యువకుడు అరుంబాక్కం అమ్మన్‌కోవిల్ సమీపంలోని టాటూ దుకాణంలో పని చేసేవాడు. అయితే, అతడు కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్‌కు పూర్తిగా బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. ఆ సొమ్మును తిరిగి సంపాదించాలని తనుపనిచేస్తున్న షాప్‌లోనే దొంగతనం చేశాడు. ఆ మొత్తాన్ని కూడా ఆటలో కోల్పోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చదివించండి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి…ఈ నెల 26న షాపులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
షాపు నుండి కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో..తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆలస్యం కావడంతో అక్కడే పడుకుని ఉంటాడని వారు అనుకున్నారు. మర్నాడు అతని తమ్ముడు షాప్‌కి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. దీంతో అతడు వెంటనే కుటుంబసభ్యులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నితీష్‌కుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.




