Anantapur: ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వే కావాలని వేధించాడు. ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరించాడు. అయితే అతని ప్రేమను యువతి నిరాకరించింది. ప్రేమించానని వెంటపడుతున్న యువకుడు అతనికి అన్న వరస అవడం గమనార్హం. దీంతో ఆమె ఈ ప్రేమను అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన యువకుడు అన్నంత పనీ చేశాడు. యువతి రోడ్డుపై వెళ్తున్న సమయంలో కారుతో ఢీ కొట్టాడు. ప్రమాదమని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు బయట పెట్టాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. ప్రేమించలేదనే కారణమంతో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని కారుతో ఢీకొట్టించి ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. యువతిని కారుతో ఢీ కొట్టిన అనంతరం జనం నుంచి తప్పించుకనే క్రమంలో అతివేగంగా పొదల్లోకి దూసుకెళ్లాడు.
ఈ ఘటనను చూసిన స్థానికులు మొదట దీనిని ప్రమాదంగా భావించినప్పటికీ.. ఆ తర్వాత విచారణ చేపట్టగా కావాలనే చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అన్న వరస కావడంతో యువతి ప్రేమను నిరాకరించినట్లు తెలుస్తోంది. కంబదూరు మండలం బోయలపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు భాస్కర్‌ను అరెస్ట్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..