Telangana Shakuntala: పునర్జన్మలు నిజమైతే తెలంగాణ శకుంతల కోరిక ఇదే..
దివంగత నటి తెలంగాణ శకుంతల జీవితం, కుటుంబం, నట ప్రస్థానంపై ఈ ప్రత్యేక కథనం. సినిమాల్లో శక్తివంతమైన నటనతో భయపెట్టిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా జీవించారు. మరాఠీ కుటుంబ నేపథ్యం ఉన్న శకుంతల గారి ఇంటి విశేషాలు, కుటుంబ సభ్యుల పరిచయాలు, ఆమెలోని గొప్ప కళాకారిణిని ఈ కథనంలో ఆవిష్కరిస్తున్నాం.

కళకు సరిహద్దులు ఉండవు… కుల, మత బేధాల పట్టింపులు ఉండవు. అందుకు తెలంగాణ శకుంతలనే ఉదాహారణ. ఆమె పుట్టింది మహారాష్ట్రలో. వాస్తవానికి ఆమె మరాఠీనే. కానీ.. ఎదిగింది, ఒదిగింది, ఒరిగింది మన తెలుగు గడ్డపైనే. ‘మాభూమి(1979)’ సినిమాతో తొలిసారి తెలుగుతెరపై మెరిశారు శకుంతల మూడున్నర దశాబ్దాల నట ప్రస్థానాన్ని సాగించి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు భాషలోని యాసలన్నింటినీ అలవోకగా పలికించగల నైపుణ్యం ఆమె సొంతం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి, తెలంగాణ యాసల్లో ఆమె పేల్చిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. కెరీర్ తొలినాళ్లలో చిన్నాచితక పాత్రలు చేసిన ఆమె.. 1995లో వచ్చిన గులాబీ చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నారు. ‘నువ్వు-నేను’ చిత్రంతో ఆమె పాపులర్ స్టార్ అయిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. గంగోత్రి, లక్ష్మి, ఎవడిగోల వాడిది, బెండు అప్పారావు ఆర్.ఎం.పి, దేశముదురు ఇలా మంచి చిత్రాలతో అలరించింది. 2014లో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఆమె చివరి చిత్రం.
తెలుగు సినీ చరిత్రలో తనదైన ప్రత్యేక శైలితో, శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన దివంగత నటి తెలంగాణ శకుంతల. ఆమె సినిమాల్లో చెప్పిన డైలాగులు, ముఖ్యంగా నువ్వు నేను వంటి చిత్రాల్లోని సంభాషణలు నేటికీ ప్రజల మదిలో సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఆమెను చూస్తే యువత భయపడే స్థాయిలో ఆమె నటన ఉండేదని చెబుతారు. అయితే, వెండితెరపై విశ్వరూపం చూపిన ఈ మహానటి, నిజ జీవితంలో మాత్రం ఎంతో నిరాడంబరంగా, ఒక సాధారణ పక్కింటి ఆంటీ వలె కనిపించేవారు. ఆమె ఇంట్లో అతిథులను సాదరంగా ఆహ్వానించి, స్వయంగా చాయ్ పెట్టి ఇచ్చేవారంటే ఆమె ఎంత సరళంగా జీవించారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కల్పనా రాయ్ కన్నీటి గాథ
శకుంతల గారి గొప్పతనం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆమె గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. కొన్ని వేల నాటకాలు ఆడారు. ఆమెకు అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఆమె అసలు నేపథ్యం చాలామందికి తెలియదు. పేరు తెలంగాణ శకుంతల అయినప్పటికీ, ఆమె తెలుగువారు కాదు. ఆమె మరాఠీ కుటుంబానికి చెందినవారు. మహారాష్ట్ర నుంచి ఆమె తండ్రి ఆర్మీ ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చి స్థిరపడటంతో, ఆమె కుటుంబం ఇక్కడే నివాసం ఏర్పరచుకుంది. ఇది ఆమె గురించి చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం.
‘ఎవడిగోల వాడిదే’ షూటింగ్ సమయంలోనే శకుంతలకు తొలిసారి హార్ట్ అటాక్ వచ్చింది. ‘ఒక వేళ నేను పోతే… మేకప్‌లో చనిపోయిన అదృష్టం కలిగేది’ అని పలు సందర్భాల్లో ఆమె చెప్పడం నటనపై తనకున్న మక్కువను తెలియజేస్తుంది. తెలంగాణ శకుంతల 63 ఏళ్ల వయసులో.. 2014, జూన్ 13 అర్థరాత్రి తన నివాసంతో గుండెపోటుతో మరణించారు. కాగా తన చివరి ఇంటర్వ్యూలలో ఒకదానిలో.. శకుంతల తనకు పునర్జన్మ ఉంటే, తెలుగు భాష పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచే విధంగా తెలుగు మాట్లాడే కుటుంబంలో పుడతానని చెప్పుకొచ్చారు.
తెలంగాణ శకుంతల ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆమె తన నటనతో, వ్యక్తిత్వంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె నిరాడంబరత, అద్భుతమైన నటన ఆమెను ఒక గొప్ప కళాకారిణిగా, ఆత్మీయ మూర్తిగా మార్చాయి. ఆమె జీవితం, కళా ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
