రియల్‌ స్టోరీ: బిడ్డకు రెండోసారి ప్రాణంపోసిన తల్లి…ఆమె ఎందరికో ఆదర్శం..

అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదని నిరూపించారు ఈ మాతృమూర్తి. ప్రమాదంలో పడిపోతున్న బిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అంతేకాదు. మరొకరు అలాంటి ప్రమాదం బారిన పడకుండా పోరాడింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరికి..

రియల్‌ స్టోరీ: బిడ్డకు రెండోసారి ప్రాణంపోసిన తల్లి...ఆమె ఎందరికో ఆదర్శం..
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 09, 2020 | 2:29 PM

అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదని నిరూపించారు ఈ మాతృమూర్తి. ప్రమాదంలో పడిపోతున్న బిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అంతేకాదు. మరొకరు అలాంటి ప్రమాదం బారిన పడకుండా పోరాడింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరికి విజయం సాధించింది. ప్రభుత్వాధికారుల్లో కదలిక తీసుకొచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది.

చెన్నై దిండుగల్‌ నందవనపట్టికి చెందిన ఉషా..మూడేళ్ల కుమారుడితో తేని వెళ్లే బస్సెక్కింది. డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చున్నారు. ఐతే కొద్దిసేపటి తర్వాత కుమారుడు పాండి..వారి సీటు కింద ఉన్న రంధ్రం నుంచి కిందకు పడబోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆ మాతృమూర్తి..బిడ్డను గట్టిగా పట్టుకొని అత్యంత చాకచక్యంగా పైకి లాగింది. ఆమె ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బిడ్డ ఆపదలో పడేవాడే. ఐతే తన బిడ్డ క్షేమంగా ఉన్నాడులే. తర్వాత ఏం జరిగితే తనకెందుకని అంతటితో ఊరుకోలేదు ఆ మహిళ. బస్సు ఉదంతం గురించి రవాణా శాఖాధికారులకు ఫిర్యాదు చేసింది. రంధ్రాన్ని పూడ్చి వేయాలని కోరింది.

ఐతే అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో..బిడ్డతో పాటు బస్సులోనే బైఠాయించింది. బస్సును డిపోకు తీసుకెళ్లాలని..అప్పటివరకు బస్సు దిగనని పట్టుబట్టింది. దీంతో డ్రైవర్‌, కండక్టర్‌ దిగిరాక తప్పలేదు. ప్రయాణికులను వేరే బస్సులో పంపి..బస్సును వత్సలగుండు డిపోకు తీసుకెళ్లారు. డిపో మేనేజర్‌ ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్న ఆమె..తన పోరాటం కొనసాగించింది. దీంతో అక్కడికి చేరుకున్న మేనేజర్‌..చేసేది లేక బస్సులో ఉన్న రంధ్రాన్ని పూడ్చివేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆమె సమక్షంలోనే రంధ్రాన్ని పూడ్చాకే అక్కడి నుంచి కదిలింది ఆ మాతృమూర్తి.

ఇది రియల్‌ లైఫ్‌ స్టోరీ ఐతే..రీల్‌ లైఫ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మూవీలో స్కూల్‌ స్టూడెంట్స్‌తో వెళ్తున్న ఓ బస్సులో చిన్నారి రంధ్రంలో నుంచి కింద పడిపోయి మృతి చెందింది. కానీ నిజ జీవితంలో మాత్రం కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ మాతృమూర్తి. మహిళా దినోత్సవం రోజు జరిగిన ఈ ఘటన ద్వారా అమ్మ గొప్పతనాన్ని నిరూపించింది ఆ మహిళ.

ఉష పోరాటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఆమె సాధించిన పనిని కొనియాడుతున్నారు నెటిజన్లు. బస్సుల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా..అధికారులు పట్టించుకోవడంలేదని..అదృష్టవశాత్తూ తన బిడ్డను కాపాడుకున్నానన్నారు ఉష. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే పోరాడినట్లు తెలిపారు.