సెల్‌ఫోన్‌ చాటింగ్ వద్దన్నందుకు భార్య ఆత్మహత్య

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌లో చాటింగ్ వద్దన్నందుకు ఓ ఇల్లాలు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 2:39 pm, Tue, 27 October 20
సెల్‌ఫోన్‌ చాటింగ్ వద్దన్నందుకు భార్య ఆత్మహత్య

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌లో చాటింగ్ వద్దన్నందుకు ఓ ఇల్లాలు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అదే పనిగా చాటింగ్‌ చేయొద్దని భర్త మందలించడంతో ఆ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచ్చింది. భూదేవినగర్‌లోని వెంకటాపురం ప్రాంతానికి చెందిన రోషన్‌ జమీర్‌, రోషన్‌ నహీలా (42) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సోన్‌ ఆఫ్రీన్‌ కూడా ఉన్నారు. ఇటీవల దంపతులిద్దరూ కొవిడ్‌-19 బారిన పడి కోలుకుని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, సోమవారం అర్థరాత్రి ప్రాంతంలో సెల్‌ఫోన్‌లో చాటింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్య సెల్‌ ఫోన్‌ తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోషన్‌ నహీలా ఇంట్లోని హాల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి సహాయంతో కిందికి దించి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. దీంతో రోషన్‌ అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.