వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో జరిగిన కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. మూసీ నది జన్మస్థలమైన దామగుండం సమీపంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి...

వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Firing in Vikarabad forest: రాజధాని హైదరాబాద్‌కు దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో జరిగిన కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. మూసీ నది జన్మస్థలమైన దామగుండం సమీపంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి వున్న ఫామ్‌హౌజ్‌ను విజిట్ చేసిన వ్యక్తులే కాల్పులకు పాల్పడ్డట్టు సమీప ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయం బయటికి చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారంటున్నారు. ఫామ్‌హౌజ్‌కు సమీపంలో పశువులను తోలుకురావద్దని తమను హెచ్చరిస్తున్నారని వారు వాపోతున్నారు.

దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్‌లున్నాయి. వాటికి సమీపంలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ ఆవు చనిపోయింది. ఈ ఫామ్‌హౌజ్‌లకు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఆరోపణల మేరకు పోలీసులు ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు.

అయితే ఈ సందర్భంగా ఫామ్ హౌజ్ నిర్వకులు స్థానికులపై బెదిరింపులకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దంటూ స్థానికులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆవు డెడ్ బాడీ నుంచి తీసిన బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆవు యజమానిని ఫామ్‌హౌజ్ నిర్వహకులు పిలిపించుకుని ముందే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫామ్‌హౌజ్‌కు వచ్చినవారు జరిపిన కాల్పుల్లోనే ఆవు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

 పోలీసుల అదుపులో ఒకరు!

ఫామ్ హౌజ్ నిర్వాహకులను విచారించిన పోలీసులు తాజాగా ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ క్రీడాకారిణికి చెందిన ఫామ్ హౌజ్ ఉద్యోగి ఉమర్ వద్ద రివాల్వర్ దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఉమర్ ఆ రివాల్వర్‌తో కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ రివాల్వర్ ఉమర్‌కు ఎలా వచ్చిందనే విషయాన్ని వారు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు