Crackers Fire Accident: తమిళనాడు బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మహిళతో సహా ముగ్గురు దుర్మరణం
తమిళనాడులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
Crackers Fire Accident: తమిళనాడులోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగిసిపడి.. ఇద్దరు మహిళల సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం సంభవించిన ఈ దుర్ఘటనలో నాలుగిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సాత్తూరు సమీపం లోని తాయిల్‌పట్టి కలైంజర్ కాలనీకి చెందిన సూర్య (29) తన ఇంట్లో అనుమతి లేకుండా టపాసులు తయారుచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆ ఇంటి వంటగదిలో ఆకస్మికంగా మంటలు రేగి నిప్పురవ్వలు టపాసులపై పడ్డాయి. దీంతో వాటికి నిప్పంటుకుని పేలుడు సంభవించింది. దీంతో సూర్య ఇల్లు సహా పక్కనే ఉన్న ఉన్న మరో మూడిళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సెల్వమణి (35), ఆమె కుమార్తె రఫియా సల్మాన్ (5), కర్పగం (35) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ఇంటి యజమాని సూర్య, సోలయమ్మాళ్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్‌తో వెళ్లి మంటలను అదుపు చేశారు. ఎస్పీ మనోహరన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. ఈ సంఘటనపై వెంబకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులకు పూర్తి వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్.. బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.