AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheting: గుమస్తా మాస్టర్ ప్లాన్.. పోలీసుల్నే బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి..

ఓ వ్యక్తి యజమానికి నమ్మకద్రోహం చేసి డబ్బులు కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. పోలీసులను కూడా బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. చివరికి..

Cheting: గుమస్తా మాస్టర్ ప్లాన్.. పోలీసుల్నే బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి..
Cheating
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 01, 2021 | 9:52 PM

ఓ వ్యక్తి యజమానికి నమ్మకద్రోహం చేసి డబ్బులు కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. పోలీసులను కూడా బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. బ్లేడ్‌తో తానే చెయ్యి కోసుకొని దోపిడీ దొంగలు దాడి చేసినట్లు కట్టు కథ అల్లాడు. కానీ అతని మాస్టర్ ప్లాన్ ఫలించలేదు. పోలీసులకు చిన్న విషయంలో అనుమానం వచ్చి విచారణ చేపట్టగా చివరికి తానే నగదు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన గొరికపూడి కనకయ్య అనే వ్యక్తి అదే గ్రామంలో ఉండే వడ్ల వ్యాపారి అయిన వెంకటేశ్వరరావు దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన యజమాని చెప్పిన చోటుకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకొని రావడం కనకయ్య పని. చాలా కాలం నుంచి అతను నమ్మకంగా పని చేస్తున్నాడు. అలా సెప్టెంబర్‌ 29న చిలకలూరిపేటలోని రైస్‌మిల్లు యజమాని అలీ వద్ద రూ.1.30 లక్షలు తీసుకొని వస్తుండగా.. కనకయ్యకు ఓ ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులు పని చేసినా ఏ ఫలితం లేదని నగదును కొట్టేయాలని ప్లాన్ వేశాడు.

తక్కెళ్లపాడు రైల్వే బ్రిడ్జి దగ్గరికి రాగానే తన వద్ద ఉన్న ఫోల్డింగ్‌ బ్లేడ్‌తో తన చొక్కాతోపాటు లోపలి బనియన్‌ చింపుకున్నాడు. తన వద్ద ఉన్న నగదును కుమారుడిని పిలిచి ఇచ్చి పంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి తన వద్ద ఉన్న నగదు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. నిందితులు ముఖాలకు మాస్కులు ధరించారని కనకయ్య చెప్పాడు. అతణ్ని క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులకు చొక్కా, బనియన్‌ చినిగిన తీరు అనుమానం కలిగించింది.

పోలీసులు తమదైన శైలిలో లోతుగా ప్రశ్నించగా.. ఆ నగదును తానే దోచినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతోపాటు మిల్లు యజమానికి నమ్మక ద్రోహం చేసినందుకు అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసును పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించారు.

Read Also..

Looted Eggs: లారీని చోరీ చేసిన దుండగులు.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..