Nellore Murder: నెల్లూరు జిల్లాలో దారుణం.. పట్టపగలు వైసీపీ కౌన్సిలర్ హత్య
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు.
Sullurpet Municipal Councillor Murder: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లూరు సురేష్ అగంతకులు దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇంటివద్ద కార్ పార్క్ చేస్తుండగా దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. సురేష్ తేరుకునే లోపే అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెళ్లి వచ్చారు సురేష్. రైల్వే క్యాబిన్ రోడ్డులో పెయిడ్ కార్ పార్కింగ్ దగ్గర.. ఈ అనూహ్య దాడి జరిగింది. సీసీ కెమెరా ఫుటేజీ కూడా లేకపోవడంతో కేసు క్లిష్టంగా ఉందంటున్నారు పోలీసులు. ఇంతకీ ఈ హత్య వెనక అసలు కోణమేంటి? ప్రత్యర్ధి పార్టీల హస్తమేదైనా ఉందా? లేక వ్యాపార పోటీదారులెవరైనా ఈ దాడికి తెగబడ్డారా?
సుళ్లూరుపేట మున్సిపల్ కౌన్సెలర్ సురేష్ కి స్టీల్ బిజినెస్ తో పాటు వడ్డీ వ్యాపారం కూడా ఉందని చెబుతున్నారు స్థానికులు. దీంతో ఈ దుర్ఘటన వ్యాపార పరమైనదా? లేక రాజకీయపరమైనదా? అంతు చిక్కడం లేదు. నిజానికి సూళ్లూరు పేటలో గత కొన్నేళ్ల క్రైమ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇలాంటి ఘటన జరిగిందే లేదంటున్నారు స్థానిక నాయకులు. కౌన్సిలర్ సురేష్ కాల్ డాటా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇతడి రాజకీయ వ్యాపార పరమైన కార్యకలాపాలను కూపీ లాగుతున్నారు. పోలీసు విచారణ పూర్తయితే గానీ సురేష్ హత్యకు దారి తీసిన కారణాలేంటో తెలియరావని అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు.
ప్రశాంతమైన సూళ్లూరుపేట పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హత్య జరిగింది. అది కూడా తాళ్లూరు సురేష్ అనే అధికార వైసీపీ కౌన్సెలర్ పై కొందరు అగంతకులు దాడి చేసి హత్య చేశారు. ఈ మర్డర్ వెనక గల కారణాలేంటి? సురేష్ కూ దుండగులకు గల సంబంధాలేంటి? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.