Tamil Nadu: విధుల్లో ఉన్న ఎస్ఐపై వేట కొడవళ్లతో దాడి.. దారుణంగా హత్య చేసిన మేకల దొంగలు..

Special sub-inspector hacked: తమిళనాడులోని తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్‌ ఎస్‌ఐను దారుణంగా హతమార్చారు. మేకల దొంగలు

Tamil Nadu: విధుల్లో ఉన్న ఎస్ఐపై వేట కొడవళ్లతో దాడి.. దారుణంగా హత్య చేసిన మేకల దొంగలు..
Crime News
Follow us

|

Updated on: Nov 22, 2021 | 12:58 PM

Special sub-inspector hacked: తమిళనాడులోని తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్‌ ఎస్‌ఐను దారుణంగా హతమార్చారు. మేకల దొంగలు వేట కొడవలితో ఎస్ఐను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అనంతరం దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టుకు చెందిన స్పెషల్ ఎస్సై భూమినాథన్‌ (55) శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్‌ సమీపంలోని కలమావూర్‌ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున బైకుపై మేకతో వెళుతున్న ఇద్దరిని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారవ్వడంతో.. భూమినాథన్‌, మరో పోలీస్‌ చిత్తిరైవేల్‌ వేర్వేరుగా ద్వచక్రవాహనాలపై వారిని వెంబడించారు. ఈ క్రమంలో మేకల దొంగలు కీరనూర్‌ ప్రాంతంలో భూమినాథన్‌ను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే లోపే దొంగలు భూమినాథన్‌ను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేసి పారిపోయారు. కీరనూర్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం దుండగులను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్.. కాగా.. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. భూమినాథన్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. భూమినాథన్ నవల్‌ పట్టు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎస్ఐ మృతిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా.. ఎస్ఐ అంత్యక్రియలు తిరుచ్చి సోలమానగర్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

ఇదిలాఉంటే.. అంతకుముందు జనవరిలో ఎస్ఐ విల్సన్‌‌ను దుండగులు హత్యచేశారు. కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై సమీపంలోని పడతలమూడు చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో ఉన్న ప్రత్యేక ఎస్సై విల్సన్‌పై ఓ వ్యక్తి కారులోనుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Also Read: