Visakhapatnam: ఆర్కే బీచ్ లో విద్యార్థి గల్లంతు.. లభించని ఆచూకీ.. కన్నీరమున్నీరవుతున్న బంధువులు
వినోదం పంచాల్సిన విశాఖ ఆర్కే బీచ్ (RK Beach) విషాదాలు నింపుతోంది. అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం, పర్యాటకులకు...
వినోదం పంచాల్సిన విశాఖ ఆర్కే బీచ్ (RK Beach) విషాదాలు నింపుతోంది. అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం, పర్యాటకులకు అవగాహన లేకపోవడం కారణమేదైనా.. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా నిన్న (ఆదివారం) అలాంటి ఘటనే జరిగింది. అలల ఉద్ధృతికి జగదీశ్ అనే ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ జగదీశ్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. జగదీశ్ ప్రాణాలతో బయటపడాలని అతని కుటుంబసభ్యులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు. ఆర్కే బీచ్ లోనే పడిగాపులు కాస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బీచ్ కు చేరుకొని జగదీశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కలెక్టర్ తో మాట్లాడారు. దీంతో నేవీ హెలీకాప్టర్ రంగంలోకి దిగింది. నిన్న గల్లంతైన జగదీశ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఎమ్మెల్యే రామకృష్ణబాబు చెప్పారు. అయితే.. బీచ్ లో రెస్క్యూ జరుగుతన్న పరిస్థితులు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గల్లంతైన యువకుడి కోసం గాలింపు జరుగుతుందా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పేదవాడైనా ధనికుడైన ప్రాణాల విలువ ఒక్కటేనని, జగదీశ్ ఆచూకీ కనిపెట్టాలని బంధువులు కోరుతున్నారు.
ఇటీవలే అనకాపల్లి ఇలాంటి ఘటనే జరిగింది. అచ్యుతాపురం మండలం సీతాపాలెం పూడిమడక బీచ్ లో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పరీక్ష రాసిన అనంతరం సరదాగా సముద్రతీరానికి వెళ్లిన యువకులు విగతజీవులుగా మారారు. సరదాగా స్నానం చేస్తుండగా ఈ ఘోరం జరిగింది. కళ్లముందే స్నేహితులు గల్లంతుకావడంతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్తారనుకున్న తమ పిల్లలు ఇక లేరని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకేరోజు ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం డైట్ కాలేజీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కాగా.. బీచ్ లలో సముద్ర స్నానాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. ఆకతాయితనంగా సముద్రంలోకి వెళ్తున్నారు. అలల ఉద్ధృతికి, ఎగసిపడుతున్న కెరటాలకు గల్లంతవుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్కే బీచ్ ప్రాంతం అంతా రాళ్లతో కూడిన అలలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ అలలు వచ్చాయంటే ఆ ధాటికి చెల్లాచెదురు అయిపోతారు. ఎంత ఈత వచ్చినప్పటికీ రాకాసి అలలను తట్టుకోవడం సులభం కాదని గజఈతగాళ్లు, స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి