Skeleton Mystery: ముగ్గురు భార్యలు.. మూడు అస్తిపంజరాలు.. స్టోరీ తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే..!
Skeleton Mystery: ముగ్గురు మహిళలను మోసం చేసి, వివాహం చేసుకున్నాడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని హర్యానా పానిపట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి
Skeleton Mystery: ముగ్గురు మహిళలను మోసం చేసి, వివాహం చేసుకున్నాడని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని హర్యానా పానిపట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మొదటి పెళ్లి గురించి రెండో భార్యకు తెలియడంతో ఆమెను, ఆమె కొడుకు, బంధువును చంపాడని తెలిసింది. మంగళవారం పానిపట్ శివనగర్‌లో స్వాధీనం చేసుకున్న మూడు అస్తిపంజరాల కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
సరోజ్ అనే మహిళ తన ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు లోపలి గదిలో మూడు అస్థిపంజరాలను గుర్తించింది. షుగర్ మిల్లులో పనిచేసే పవన్ అనే వ్యక్తి నుంచి ఆమె 2017 లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది. పోలీసుల దర్యాప్తులో పవన్ ఒక అహ్సాన్ సైఫీ నుంచి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే అహ్సాన్ సైఫీ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లోని భడోహిలోని కాశీరామ్ ఆవాస్ కాలనీలో నివసిస్తున్నాడని తెలిసింది. అయితే అతడి గురించి ఆరా తీయగా నేర ప్రవృత్తి గలవాడని తెలిసింది.
దీంతో పోలీసులు అహ్సాన్ పై అనుమానం వ్యక్తం చేశారు. భడోహిలోని అతడి ఇంటిని గుర్తించిన తర్వాత, అహ్సాన్ సైఫీని అరెస్టు చేశారు. అతను తన రెండో భార్య నజ్నీన్, అతని 15 ఏళ్ల కుమారుడు, బంధువును చంపినట్లు ఒప్పుకున్నాడు. అహ్సాన్‌ను పానిపట్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు, అతన్ని 10 రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించారు. అహ్సాన్ సైఫీ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఒక ప్రొఫైల్‌ను సృష్టించి పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసేవాడు. ఇతడు వడ్రంగి పని చేసేవాడు అంతేకాకుండా సోషల్ మీడియాను తన అక్రమాలకు వాడుకునేవాడు.
మ్యాట్రిమోనిలోనే ముంబై నివాసి అయిన నజ్నీన్‌ను కలుసుకుని, తరువాత ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అతను తన మొదటి వివాహం గురించి నజ్నీన్కు తెలియజేయలేదు. ఆమెను వివాహం చేసుకున్న తరువాత, అతను పానిపట్కు మారాడు. అయితే అతను ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో నివసించిన తన మొదటి భార్య, ముగ్గురు పిల్లలను కూడా సందర్శించేవాడు. అయితే అహ్సాన్‌కు అప్పటికే వివాహం అయిందని నజ్నీన్ తెలుసుకున్నప్పుడు, ఆమె అతని మొదటి భార్యను చూడటానికి అనుమతించలేదు. దీంతో వారి మధ్య గొడవలు పెరిగాయి.
2016 నవంబర్‌లో నజ్నీన్, ఆమె కుమారుడు, బంధువును ఆహారంలో విషం కలిపి చంపాడు. అనంతరం ఇంట్లోనే గోతి తవ్వి మృతదేహాలను పూడ్చిపెట్టాడు. అనంతరం ఆ ఇంటిని పవన్‌కు విక్రయించాడు. అహ్సాన్ తన నేరాన్ని అంగీకరించి పానిపట్ ఇంట్లో దొరికిన మూడు అస్థిపంజరాలు అతడి భార్య నజ్నీన్ , అతని కుమారుడు సోహైల్, నజ్నీన్ బావ షబ్బీర్ అని పోలీసులకు చెప్పాడు. మృతదేహాలను ఖననం చేసిన తరువాత, అతను ఆ ఇంటిని విక్రయించి, మూడో సారి వివాహం చేసుకున్నాడు. అతను ప్రస్తుతం తన మూడో భార్యతో ఉత్తర ప్రదేశ్ లోని భడోహిలో నివసిస్తున్నాడు.