Gangster: ఒడిశాలో జైలు నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హైదరాబాద్ లో.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు!
ఒడిశా రాష్ట్రం నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను హైదరాబాద్ చేరుకున్నాడని సమాచారం. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Gangster: ఒడిశా రాష్ట్రం నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను హైదరాబాద్ చేరుకున్నాడని ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భువనేశ్వర్ కు చెందిన మైన్స్ యజమాని రష్మీ రాజన్ మోఘాప్తరాను కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణలు నిర్ధారణ కావడంతో భవనేశ్వర్ కోర్టు 2015లో గ్యాంగ్‌స్టర్ షేర్ హైదర్ కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి 2017 వరకూ భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైలులో ఉన్న హైదర్ ను భద్రతా కారణాల నేపథ్యంలో సబల్‌పూర్ జైలుకు మార్చారు. నాలుగురోజుల క్రితం తన ఆరోగ్యం బాగోలేదని.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాననీ హైదర్ అక్కడి జైలు అధికారులకు చెప్పడంతో, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం సాయంత్రం 4.30 గంటలకు తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని కటక్ పోలీసులు మూడు గంటల ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమయ్యారు. అప్పటికే హైదర్ మరో ఇద్దరితో కలిసి కారులో వెళ్లినట్లు తేలింది.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం హైదర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించాడు. అతను ప్రయాణించిన స్విఫ్ట్ వాహనం (ఓడీ 02 ఏఎస్ 6770) ఆదివారం రాత్రి 8.42 గంటలకు పంతంగి టోల్ ప్లాజా దాటింది. ఆ తర్వాత నగరంలోని కొన్నిచోట్ల సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నా.. ఆపై ఆచూకీ లభించలేదు. హైదర్‌కు మహారాష్ట్రలోనూ కొన్ని షెల్టర్లు ఉన్నాయని ఒడిశా పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా కటక్ పోలీసులు హైదర్‌ను నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మహారాష్ట్రకు హైదర్ జంప్ అయి ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. అయినా, మరోపక్క నగరంతో పాటు నగర శివార్లలోనూ గాలింపును కొనసాగిస్తున్నారు. హైదర్ లేదా అతడి వాహనం ఆచూకీ తెలిస్తే 94906 16640 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీటీ కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గ్యాంగ్‌స్టర్ కోసం ఒడిశా పోలీసులు సైతం సిటీకి చేరుకుని గాలిస్తున్నారు.
CORONA EFFECT: దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు కరోనా.. ఎవరెవరికి ఎప్పుడంటే?