Rape case: రాజకీయ రంగుపులుముకున్న మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటన.. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్..
కర్నాటకలో మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. పోలీసు బృందాలు గాలిస్తున్నా.. సీసీ ఫుటేజ్ తిరగేస్తున్నా.. నిందితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.
కర్నాటకలో మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. పోలీసు బృందాలు గాలిస్తున్నా.. సీసీ ఫుటేజ్ తిరగేస్తున్నా.. నిందితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో సిట్ ఏర్పాటు చేసింది బొమ్మై సర్కార్. మరోవైపు బాధితురాలి పరిస్థితి విషమంగా మారినట్టు తెలుస్తోంది. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేస్తే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
బాధితురాలు ఉత్తరప్రదేశ్‌కి చెందిన యువతిగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతోంది. మంగళవారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి ఆమె చాముండి హిల్స్‌కి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగొస్తున్న క్రమంలో… మార్గమధ్యలో లలితాద్రిపురా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ గ్యాంగ్ వారిని అడ్డగించింది. ముందు డబ్బు డిమాండ్ చేశారు. డబ్బుల్లేవని తెలిశాక దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం బొమ్మై సీరియస్ అయ్యారు. నిందితుల్ని త్వరగా అరెస్ట్ చేయాలని డీజీపీ ప్రవీణ్ సూద్‌ను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు బొమ్మై.
ఈ ఘటనపై స్పందించారు హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర. నిందితులను త్వరగా పట్టుకునేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. ఇప్పటికైతే ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించామన్నారు.
మరోవైపు, మహిళలపై నేరాలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మైసూరులో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాష్ట్ర హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: Havana Syndrome: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..