Fuel Theft: ‘బైక్ వద్దు.. పెట్రోల్ ముద్దు’.. పంథా మార్చిన చిల్లర దొంగలు.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వరుస చోరీలు!
పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో చిల్లర దొంగలు పంథా మార్చారు.. బైక్‌లను వదిలి పెట్రోలు చోరీ చేస్తున్నారు. పెట్రోల్ చోరీ వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Fuel Theft from Vehicles in Ongole: పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో చిల్లర దొంగలు పంథా మార్చారు.. బైక్‌లను వదిలి పెట్రోలు చోరీ చేస్తున్నారు. పెట్రోల్ చోరీ వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో పెట్రోలు దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో వీధుల్లో పార్క్ చేసిన బైక్‌లలో పెట్రోల్ చోరీకి పాల్పడుతున్నారు. లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడంతో కొంతమంది యువకులు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఇళ్లల్లో పెట్రోల్ కోసం డబ్బులివ్వకపోవడంతో దొంగావతారం ఎత్తుతున్నారు యువకులు. కర్ఫ్యూ అమలవుతున్న కారణంగా తల్లిదండ్రుల దగ్గర వీరికి డబ్బులు పుట్టడం లేదు. ఏం చేయాలో పాలుపోక అవసరాలను తీర్చుకునేందుకు చిల్లర దొంగల అవతారమెత్తారు.
ఒంగోలు నగరం అన్నవరప్పాడు కాలనీలో వీధుల్లో, ఇళ్ల బయట పార్క్ చేసిన వాహనాల్లోనుంచి పెట్రోల్ చోరీకి ఎగబడుతున్నారు. చోరీ దశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాత్రిపూట పోలీసుల గస్తీ లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. కిటికీల్లో నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు కూడా ఎత్తుకెళ్తున్నారని చెబుతున్నారు. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేశారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.