Milk Adulteration: చిత్తూరు జిల్లాలో పాల‘కూట’ విషం.. విచ్చల విడిగా కల్తీపాల తయారీ.. ఇందులో కలిపే రసాయనాలు ఏంటో తెలిస్తే షాక్..!
పాలు విషపూరితమవుతున్నాయి. కొందరు కల్తీగాళ్లు రకరకాల పద్ధతుల్లో పాలను తయారు చేస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
Fake Milk Making and Supplying: పాలు స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనం. అవి లేనిదే రోజు మొదలడం కష్టం. పసికందు నుంచి ప్రతి ఒక్కరూ రోజూ పాలు తీసుకుంటారు. కానీ ఆ పాలు విషపూరితమవుతున్నాయి. కొందరు కల్తీగాళ్లు రకరకాల పద్ధతుల్లో పాలను తయారు చేస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అవి చిక్కదనంతో కూడిన చక్కనైన పాలు కాదు.. కాలకూట విషం. అవును ఇది నిజం. చిత్తూరు జిల్లాలో ఆహారభద్రత అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. యూరియాతో కూడిన కల్తీపాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ పాలు తాగుతున్న చాలామంది చిన్నారులు అనారోగ్యం బారిన పడడం ఖాయమంటున్నారు అధికారులు.
కె.వి పల్లి మండలం చిన్న గోరంట్లపల్లిలో కల్తీ పాల తయారీ జరుగుతుందనే సమాచారంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఆహారభద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న సీన్ చూసి షాకయ్యారు. కాసిన్ని పాలు, కొంచెం రిఫైన్డ్ ఆయిల్, ఇంకాస్త యూరియా.. ఈ మూడింటిని గ్రౌండ్ లో మిక్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఏంటా అని ఆరాతీస్తే.. చిక్కదనం కోసం అనే సమాధానం వచ్చింది. దీంతో మరింత షాకయ్యారు అధికారులు.ఇలా కల్తీపాలు తయారు చేస్తున్న వారు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీటిని కొందరు ప్రైవేటు డెయిరీలకు పోస్తుండగా, మరికొందరు నేరుగా ప్రజలకు విక్రయించి వారిని అనారోగ్యం‘పాలు’ చేస్తున్నారు.
కల్తీ పాలు తయారు చేస్తున్న సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కల్తీ దందా గుట్టు మొత్తం విప్పాడు. రైతుల నుంచి ఓ క్యాన్ అంటే దాదాపు 40లీటర్ల పాలు సంజీవరెడ్డి సేకరిస్తున్నాడు. వాటిని ఇంటికి తీసుకొచ్చి.. ఆ తర్వాత యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో కలిపిన నకిలీ మిల్క్ ను.. అసలు పాలల్లో మిక్స్ చేస్తున్నాడు. అలా 40 లీటర్ల పాలను రెండు క్యాన్లు అంటే 80 లీటర్లుగా మార్చేసి ఇంటింటికి వెళ్లి మిల్క్ సప్లయ్ చేస్తున్నాడు. కొద్దిరోజులుగా సంజీవరెడ్డి ఈ మాయదారి దందా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సంజీవరెడ్డి చావు తెలివితేటలతో అధికారులు అవాకయ్యారు.
అధికారుల దాడిలో సంజీవరెడ్డి నిర్వాకం బయటపడింది. డబ్బు సంపాదించాలనే అత్యాశతో చిన్నపిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. యూరియాతో కూడిన ఈ పాలు పిల్లలు తాగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. కల్తీపాలను ల్యాబ్ కు పంపారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ప్రకారం సంజీవరెడ్డిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు.