Online Gaming App: కోట్లాదిగా కొల్లగొట్టిన చైనా కంపెనీల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు ముమ్మరం
Online Gaming App: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు లింక్‌యున్, డోకీపేల ద్వారా కోట్లాదిగా కొల్లగొట్టిన చైనా కంపెనీల వ్యవహారంలో హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్..
Online Gaming App: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు లింక్‌యున్, డోకీపేల ద్వారా కోట్లాదిగా కొల్లగొట్టిన చైనా కంపెనీల వ్యవహారంలో హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యాప్‌ల ద్వారా రూ.1,100 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలంగాణ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో విదేశాలకు నిధుల మళ్లింపుపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. గుజరాత్ భావ్‌నగర్‌లోని క్రిప్టో కరెన్సీ ఏజెంట్ నైసర్ శైలేష్ కొరాఠి భారత కరెన్సీని యూఎస్‌డీటీ క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.
గుజరాత్‌కు చెందిన కమలేష్ త్రివేది చైనా కంపెనీలకు మధ్యవర్తిగా వ్యవహరించి కొఠారి ఏజన్సీ ద్వారా క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయించినట్లు తేలడంతో అతని కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ గాలింపు చర్యలు చేపట్టింది. రూ.4.5 కోట్లను క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మరిన్ని ఏజన్సీల నుంచి రూ.14.18 కోట్ల హవాలా లావాదేవీలను గుర్తించడం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.104 కోట్లను విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది.
భారత్ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా తరలిన నిధులు చైనాలోని 2018లో ఏర్పాటైన బీజింగ్ టుమారో పవన్ కంపెనీకి బదిలీ అయినట్లు ఈడీ భావిస్తోంది. భారత్‌లో కుమార్ పత్ని అండ్ అసోసియేట్స్ కన్సల్టెంట్స్ ద్వారా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆధారాలు రాబట్టింది. మరోవైపు లింక్‌యున్, డోకీపే యాప్‌ల సంస్థలకు భారత్‌లో చైనాకు చెందిన యాన్‌హూ హెడ్ కాగా, ధీరజ్ సర్కార్, అంకిత్‌కపూర్‌లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.