అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా.. ఏం చేసిందో తెలుసా..?
రంగారెడ్డి జిల్లా మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డబ్బు కోసం సొంత తల్లి.. చిన్న కుమార్తె పిల్లలను పెద్ద కుమార్తె సహాయంతో కిడ్నాప్ చేసింది...
రంగారెడ్డి జిల్లా మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డబ్బు కోసం సొంత తల్లి.. చిన్న కుమార్తె పిల్లలను పెద్ద కుమార్తె సహాయంతో కిడ్నాప్ చేసింది. బాధితురాలు రుహి.. మియాపూర్‌లోని మదీనాగూడలో నివాసముంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆమె భర్త చనిపోవడంతో తల్లి, అక్కను తన వద్దే ఉంచుకుని పోషిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి, అక్క ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వెళ్లారు. ఈ విషయం రుహీకి తెలియకపోవడంతో పిల్లలు, తల్లి, అక్క ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. తన పిల్లలను సొంత ఊరు తీసుకెళ్లారని తెలుసుకుని అక్కడకు వెళ్లింది. అయితే తన పిల్లలను పంపించాలని కోరితే బంధువులు తనపై దాడి చేశారని బాధితురాలు తెలిపారు.
అంతేకాకుండా తన దగ్గర ఉన్న ఫోన్, నగదు, బంగారం కూడా లాక్కున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తన తల్లికి ఫోన్ చేస్తే.. సమాధానం ఇవ్వడం లేదని, రూ.30 లక్షలు ఇస్తేనే పిల్లలను అప్పగిస్తామని డిమాండ్ చేస్తున్నారని రుహి వాపోయారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన డాక్టర్ రుహి.. ఈ ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు తమ పరిధిలోకి రాదని, సత్తుపల్లిలో ఫిర్యాదు చేయాలని చెప్పారని, అక్కడ కేసు పెట్టేందుకు వెళ్తే వారూ కేసు నమోదు చేయలేదని రుహి ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం సీపీని కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. కిడ్నాప్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, అక్కడికే వెళ్లమంటూ.. మానసిక క్షోభకు గురి చేశారని వాపోయారు. చివరికి మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రుహి తెలిపారు. పిల్లలను కిడ్నాప్ చేసి ఇరవై రోజులు గడిచినా తనకు న్యాయం జరగలేదని రుహి కంటతడి పెట్టారు. తన పిల్లలను తల్లి, అక్క చెర నుంచి విడిపించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కేసు విచారణలో భాగంగా బాధితురాలి మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఏడాదిన్నర క్రితం నా భర్త గుండెపోటుతో చనిపోయారు. పిల్లలను చూసుకుంటామని చెప్పి మా అమ్మ, అక్క నా ఇంటికి వచ్చారు. నేను ఇంట్లో లేని సమయంలో నా పిల్లలు, సర్టిఫికెట్లను తీసుకుని సత్తుపల్లికి వెళ్లారు. నా స్నేహితుల సాయంతో పిల్లల కోసం అటూ ఇటూ తిరిగాను. తెలిసిన వాళ్ల ఇంట్లో వెతికాను. చివరకు సొంతూరిలో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లాను. అక్కడ నామీద దాడి చేశారు. ఏటీఎం, పాన్, కార్ కీస్ తీసుకున్నారు. పిల్లలను నాకు చూపించకుండా డబ్బులు డిమాండ్ చేశారు. పోలీసుల వద్దకు తిరిగి తిరిగి కంప్లైంట్ చేశాను. నా పిల్లలను నా దగ్గరకి చేర్చాలని వేడుకుంటున్నాను.
– రుహి, బాధితురాలు
Also Read
Childhood Pic: హీరో చేతిలో హీరో.. టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ వారసులు.. ఎవరో తెలుసా..
అదనపు కట్నం, అత్తింటి వేధింపులు.. మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య