Doctors Negligence: కరీంనగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్‌కు యత్నం.. పేషెంట్ అరుపులతో అప్రమత్తం!
ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు... ఆమె నొప్పిని భరించలేక అరవడంతో అప్రమత్తమైన వైద్యులు కుట్లు వేసి పంపించారు.
Govt. Doctors Negligence in Karimnagar district: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు. ఆమె నొప్పిని భరించలేక అరవడంతో అప్రమత్తమైన వైద్యులు కుట్లు వేసి పంపించారు. ఈ ఘటన కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది.
బాధితురాలి భర్త నరోత్తమరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన మాలతి, నరోత్తమరెడ్డి దంపతులు. మాలతి ఏడు నెలల గర్భవతి.. నీరసంగా ఉండటం, కడుపునొప్పి రావడంతో గురువారం కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. శుక్రవారం స్కానింగ్ చేసిన వైద్యసిబ్బంది.. గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని గుర్తించారు. అందులో ఒక శిశువు బతికే అవకాశం లేదని, ఇంకొక శిశువును కాపాడేందుకు సోమవారం గర్భాశయానికి కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు.
సోమవారం ఉదయం మాలతిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న డాక్టర్ వేరొకరి కేస్‌షీట్ చదివి మాలతి పొట్ట కోశారు. మాలతి గట్టిగా అరిచి వివరాలు చెప్పడంతో చీరిన పొట్టకు కుట్లు వేసి పంపించారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదం జరిగేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేస్తామని ఆర్‌ఎంఓ శౌరయ్య తెలిపారు.