Corporator Husband: వైసీపీ కార్పొరేటర్ భర్త వీరంగం.. వెళ్లిపోయిన బస్సుని వెనక్కి రప్పించాలంటూ ఏజెంట్‌పై దాడి
ఓ కార్పొరేటర్ భర్త చేసిన వీరంగం అంత ఇంత కాదు. ప్రజాప్రతినిధులమన్న విషయం మరిచిపోయి రెచ్చిపోయాడు.
Corporator Husband Attack: ఓ కార్పొరేటర్ భర్త చేసిన వీరంగం అంత ఇంత కాదు. ప్రజాప్రతినిధులమన్న విషయం మరిచిపోయి రెచ్చిపోయాడు. వెళ్లిపోయిన బస్సుని వెనక్కి రప్పించాలంటూ ట్రావెల్ ఏజెంట్(Travel Agent)ను చితకబాదాడు. అనుచరగణాన్ని వెంటేసుకుని వచ్చి మరీ, జులూం చూపించాడు. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ఏలూరు నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ భీమవరపు హేమాసుందరి భర్త రౌడీ షీటర్ అయిన భీమవరపు సురేష్(Bheemavarapu Suresh) గురువారం రాత్రి ఓ ట్రావెల్ ఆఫీసులో వీరంగం సృష్టించాడు. ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో దాడి చేసి, సిబ్బందిని చావబాదాడు.
ఏలూరు నుంచి ప్రయాణం చేసేందుకు టికెట్ బుక్ చేసుకుని ఆలస్యంగా వెళ్లాడు సురేష్. అయితే, అప్పటికే బస్సు వెళ్లిపోవటంతో.. వెనక్కి రప్పించాలంటూ ట్రావెల్ ఏజెంట్‌కు హుకుం జారీ చేశాడు. అయితే, అలా చేస్తే, ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారని, మరో బస్సులో పంపుతామని ట్రావెల్ ఏజెంట్ సర్ది చెప్పారు. దీంతో రెచ్చిపోయిన సురేష్.. తన అనుచరులతో వచ్చి ట్రావెల్ సిబ్బందిపై దారుణంగా దాడి చేసి చితకబాదాడు. అడ్డొచ్చిన స్థానికులపై దాడి చేశాడు. కార్పొరేటర్ అయిన భార్య హేమసుందరి దగ్గరే ఉండి దాడిని ప్రోత్సహించడం విశేషం. ఈ ఘటనలో గాయపడిన సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేస్తే మళ్లీ వచ్చి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు రౌడీషీటర్ సురేష్. కాగా, ఈ గుండాయిజానికి సంబంధించి విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఇదిలావుంటే, గత నెలలో ఏలూరులో ఓ డాక్టర్ ని బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి కాజేసేందుకు వైసీపీ కార్పొరేటర్ భర్త రౌడీషీటర్ సురేష్ బెదిరింపులకి పాల్పడటంతో కేసు నమోదైంది. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి సురేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు అయినప్పటికీ దాడులకు తెగబడటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచే రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.