Tirumala Accident: తిరుమలలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం.. గరుడ వారధిపై కారు బోల్తా
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధమైన ఘటన కలకలం రేపుతుంది. మూడవ కిలో మీటర్ వద్ద ఈ ఘటన జరిగింది.
Tirumala Tirupati Car Accident: తిరుమల రెండో ఘాట్ రోడ్డు(Tirumala Ghat Road)లో కారు దగ్ధమైన ఘటన కలకలం రేపుతుంది. మూడవ కిలో మీటర్ వద్ద ఈ ఘటన జరిగింది. భక్తులు.. శ్రీవారి దర్శనానికి కర్నూలు(Kurnool) నుండి తిరుమల(Tiurumala)కు వెళ్తుండగా ఒక్కసారిగి కారులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన భక్తులు వెంటనే కారు దిగి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.
మరోవైపు, తిరుపతి గరుడ వారధిపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు వెనక నుండి మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు దీరాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కాగా, ఘాట్ రోడ్డులో కారు ప్రమాదానాకి గురికావడంతో భక్తులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలావుంటే, నిన్న 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది. Read Also…. AP Weather Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల 2 రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం