కొవిడ్ సెంటర్ నుంచి పారిపోయిన వ్యక్తికి ఏడు నెలల జైలుశిక్ష
విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కరోనా నిబంధనలు ఉల్లఘించిన ఓ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష విధించింది.

విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కరోనా నిబంధనలు ఉల్లఘించిన ఓ వ్యక్తికి ఏడు నెలల జైలు శిక్ష విధించింది. దేశంలో కరోనా మహ్మరి విజృంభిస్తోంది. కరోనా నుంచి మరొకరికి సోకకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ఇలాంటి సమయంలో కరోనా సోకిన వ్యక్తి విచ్చలవిడిగా తిరగడాన్ని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధ నిర్బంధంలో ఉన్న రిమాండ్ ఖైదీ కొవిడ్ కేర్ కేంద్రం నుంచి పారిపోయి… కరోనా వ్యాప్తికి కారణమయ్యాడనే అభియోగంపై నమోదైన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడు నెలల జైలు శిక్ష విధించింది. తన నిర్లక్ష్యపూరిత, చట్టవ్యతిరేక చర్యల వల్ల వైరస్ వ్యాప్తికి దోహదపడ్డాడనే నేరం రుజువు కావటంతో శిక్ష విధించటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెంకు చెందిన కూతాటి వెంకటేశ్వర్లు విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషన్ పరిధిలో 2019లో నమోదైన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో అతనితో పాటు మరో 16 మందికి కరోనా సోకింది. దీంతో వీరందర్నీ ఈడ్పుగల్లులోని కొవిడ్ కేర్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏడుగురు కానిస్టేబుళ్లకు ఇక్కడ గార్డు డ్యూటీ అప్పగించారు. ఇదే అదునుగా భావించి వెంకటేశ్వర్లు తప్పించుకోవాలని చూశాడు. స్నానం చేయటానికంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 6న కంకిపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జైలు సిబ్బంది. ఎట్టకేలకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంటేశ్వర్లును పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. దీనిపై మూడు నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం.. నేరం రుజువైనందున అతనికి ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. విజయవాడలోని అయిదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అయిదో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కేపీ సాయిరామ్ ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు.
