MLA Kakani : ఆనందయ్యతో కాకాణి చర్చలు.. అధ్యయనం నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే మనవి
MLA Kakani meeting with Anandayya : ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఉంది..
MLA Kakani meeting with Anandayya : ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఉంది.. నిపుణుల బృందం నివేదికలు సమర్పించి, ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే మందు పంపిణీ ప్రారంభిస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేద మందును చాలా మంది కోరుకుంటున్న నేపథ్యంలో అవసరమైన మేర మందు తయారీకి సిద్ధంగా ఉన్నామని కాకాణి వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలతో పాటు, జిల్లా వ్యాప్తంగా అవసరమైన వారందరికీ మందు అందజేస్తామని ఆయన తెలిపారు. కాగా, ఆయుర్వేద మందు పై శాస్త్రీయ అధ్యయనం జరుగుతున్న పరిస్థితులలో కరోనా మందు కోసం ఎవ్వరూ కూడా కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఎమ్మెల్యే కాకాణి మనవి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, కృష్ణపట్నంలో ఆనందయ్య తో చర్చలు జరిపిన అనంతరం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా అయిన కాకాణి పై విధంగా స్పందించారు.
ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల వారికి కూడా ఆన్లైన్ పద్ధతి పోస్టల్ లేదా కొరియర్ సర్వీసు ద్వారా మందు పంపించే ఏర్పాటు చేస్తామని కూడా కాకాణి వెల్లడించారు. ప్రతిపక్షం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, ఆనందయ్య ఆయుర్వేద మందును కూడా తమ నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.