Covid 19: కొవిడ్ చికిత్సలో మరో ముందడుగు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న ‘ఫైజర్’ మాత్రలు
Pfizer Covid-19 pill: కరోనా బాధితులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో కొవిడ్ నివారణకు మందు బిళ్లలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ తెలిపింది.

Pfizer Covid-19 pill: కరోనా బాధితులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో కొవిడ్ నివారణకు మందు బిళ్లలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రులపాలై, మరణాన్ని ఎదుర్కోవాల్సిన ముప్పును సుమారు 90% మేర తగ్గించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వీటిని తాము అభివృద్ధి చేసి, ప్రయోగ పరీక్షలు పూర్తిచేసినట్టు ఫైజర్ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఇక, అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు. కొవిడ్ బాధితులకు ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను మాత్రమే ఇస్తున్నారు. దీంతో కొవిడ్ నుంచి కొంతమేరకు మాత్రమే ఉపశమనం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో మాత్రలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఔషధ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అందరికంటే ముందుగా ‘మెరెక్’ సంస్థ మందు బిళ్లలను అభివృద్ధి చేసింది. బ్రిటన్ ఆరోగ్య శాఖ వీటి ఫలితాలను సమీక్షించి, ఇప్పటికే ఆమోదం తెలిపింది. అటు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే పరీక్షలు పూర్తి చేసుకుని ఆమోదముద్ర పడే అవకాశముందని ఫైజర్ సంస్థ చెబుతోంది. అయితే, కొవిడ్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకోగల మాత్రలను తాము అభివృద్ధి చేసినట్టు ఫైజర్ ప్రధాన శాస్త్రవేత్త డా.మైకేల్ డోల్‌స్టెన్ వెల్లడించారు.
‘‘మాత్రలు అందుబాటులోకి వస్తే కొవిడ్ చికిత్స సులభతరం కానుంది. మొత్తం 775 మంది బాధిత వయోజనులకు ఇతర యాంటీవైరల్ ఔషధాలతో కలిపి వీటిని చికిత్సగా అందించాం. వీరెవరూ టీకాలు తీసుకోలేదు. పైగా మధుమేహం, హృద్రోగం, స్థూలకాయంతో బాధపడుతున్నవారే. స్వల్ప-మధ్యస్థాయి లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లోనే చికిత్సను ప్రారంభించి, ఐదు రోజులపాటు కొనసాగించాం. ఆ సమయంలో వీరిలో కొద్దిపాటి దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే, కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణం ముప్పు 89% మేర తగ్గినట్టు గుర్తించాం. 1% కంటే తక్కువమంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. కానీ, వీరిలో ఒక్కరు కూడా మరణించలేదు. సుమారు 90% సమర్థతతో పనిచేస్తున్న ఈ మాత్రలు… మరణం నుంచి 100% రక్షణ కల్పించగలవు’’ అని డా.మైకేల్ వివరించారు.
Read Also… Crime News: పాకిస్థాన్‌లో మరో నీచ భాగోతం బట్టబయలు.. అధికారుల దర్యాప్తుతో వెలుగులోకి సంచలనాలు!