తెలంగాణలో మరోసారి కలవరపెడుతున్న కరోనా వైరస్.. కొత్తగా 114 మందికి కోవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్ర కొత్తగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 1:19 pm, Tue, 23 February 21
తెలంగాణలో మరోసారి కలవరపెడుతున్న కరోనా వైరస్.. కొత్తగా 114 మందికి కోవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్ర కొత్తగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన నమూనా పరీక్షల్లో కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,97,712కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా 1,625 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆదివారం కరోనా బారి నుంచి 143 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో సురక్షితంగా బయపడ్డవారి సంఖ్య 2,94,386కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,701 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 645 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కొవిడ్‌ కేసులు మళ్లీ క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో సత్వరమే కట్టడి చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండటంపైనా దృష్టిసారించింది. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ఉన్నతాధికారులతో వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందనీ, పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఈటల స్పష్టం చేశారు.

ఇదీ చదవండిః ఆ ఐదు రాష్ట్రాల నుంచి వస్తే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే… ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు